ఓటర్లకు ప్రలోభాల ఎర.. జనసేనపైనే అనుమానం

By ramya NFirst Published Apr 8, 2019, 9:46 AM IST
Highlights

ఎన్నికలకు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఎన్నికలకు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రలోభాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒక్కో ఓటరుకు రూ.2 వేలు చొప్పున ఇచ్చేలా టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. 

టోకెన్లను ఓటర్లకు ఇచ్చి ఒక సెంటర్‌ పేరు చెబుతున్నారు. అక్కడికి ఈ టోకెన్లను తీసుకుని వెళితే రూ.2 వేల చొప్పున ఇచ్చేలా నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇలా ప్రలోభాలు జనసేన నేతలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇలా టోకెన్లను పంపిణీ చేస్తున్న 12 మంది జనసేన కార్యకర్తలను పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ఆదివారం పట్టుకుని ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పుంగనూరు సమీపంలోని క్రిష్ణమరెడ్డిపల్లె, బోడినాయినిపల్లె పరిసరాల్లో 8 మంది జనసేన కార్యకర్తలు ముద్రించిన రూ.2 వేలు టోకెన్లను ఓటర్లకు పంపిణీ చేస్తుండగా ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు శ్రీనివాసరావు, టీమ్‌ ఆఫీసర్‌ శివకుమార్‌ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12 లక్షలు విలువ జేసే 600 టోకెన్లను, రూ.46 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. చౌడేపల్లెలో టోకెన్లు పంపిణీ చేస్తుండగా నలుగురు యువకులను పట్టుకుని 1,600 టోకెన్లను స్వాధీనం చేసుకున్నారు.
 

click me!