
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన అత్యంత ఆప్తమిత్రుడు, వైసీపీ నేత, కమెడియన్ అలీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలీ రాజకీయ ప్రవేశంపై ఓ న్యూస్ ఛానెల్ లో మాట్లాడిన పవన్ యాక్టర్లు, పాపులారిటీ రెండూ వేర్వేరు అంటూ చెప్పుకొచ్చారు.
పాపులారిటీని చూసి జనం చప్పట్లు కొడతారని తెలిపారు. ఆ చప్పట్లను సీరియస్ గా తీసుకోకూడదని హితవు పలికారు. వాటిని నమ్మకూడదన్నారు. తనకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారని వాటిని తాను నమ్మదలచుకోలేదన్నారు. తన మిత్రుడు అలీకి ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు.
జగన్ మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మి వెళ్లాడు. చంద్రబాబు నాయుడుకు లేదని అక్కడికి వెళ్లకపోవచ్చేమోనన్నారు. అది ఆయన ఛాయిస్ అంటూ చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో అలీ, పవన్ కళ్యాణ్‌లకు మంచి అనుబంధం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పవన్ కళ్యాణ్ సినిమాలో కచ్చితంగా అలీ ఉండి తీరాల్సిందే. అలాంటి సమయాల్లో అలీ రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతున్నప్పుడు అంతా ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ ఊహించని రీతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
వైసీపీలో చేరిన తర్వాత కూడా ఆయన పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ షోలో పాల్గొన్న అలీ మగ మథర్ థెరిస్సా ఉంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కరేనని ప్రశంసించారు. ఆయనలాంటి సేవాగుణం కలిగిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి ఎవరూ లేకపోవచ్చంటూ అలీ కీలక వ్యాఖ్యలు చేశారు.