తాజా సర్వే: జగన్‌దే హవా, పవన్ నామమాత్రమే

By narsimha lodeFirst Published Apr 4, 2019, 10:54 AM IST
Highlights

: ఏపీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయభేరి మోగించే అవకాశం ఉందని  సీపీఎస్(సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్) సర్వే తేల్చి చెప్పింది.మొత్తం 175 అసెంబ్లీ స్థాల్లో వైసీపీకి 121 నుండి 130 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.


అమరావతి: ఏపీ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో వైసీపీ విజయభేరి మోగించే అవకాశం ఉందని  సీపీఎస్(సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్) సర్వే తేల్చి చెప్పింది.మొత్తం 175 అసెంబ్లీ స్థాల్లో వైసీపీకి 121 నుండి 130 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. మరో వైపు అధికార టీడీపీ 45 నుండి 54 అసెంబ్లీ సీట్లకే పరిమితం కానుందని  ఆ సర్వే తేల్చింది. 

 రెండు దఫాలుగా ఏపీ ఎన్నికలపై సీపీఎస్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలపై ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు డాక్టర్ వేణుగోపాలరావు ప్రముఖ పాత్రికేయుడు సుధీర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో సర్వే ఫలితాలను ప్రకటించారు.

ఏపీ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 25 ఎంపీ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.  అయితే రాష్ట్రంలోని 121 నుండి 130 అసెంబ్లీ స్థానాలతో పాటు 21 ఎంపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకొంటుందని  ఈ సర్వే తేల్చి చెప్పింది.  టీడీపీ 45 నుండి 54 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కానుందని  ఈ సర్వేను బట్టి తెలుస్తోంది. మరో వైపు 25 ఎంపీ స్థానాల్లో కేవలం 4 ఎంపీ స్థానాలకే టీడీపీ పరిమితమయ్యే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ అభిప్రాయపడింది.

ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుండి 21వ తేదీ వరకు మొదటిదశలో 4,37,642 మంది అభిప్రాయాలను సేకరించారు. మార్చి 27 నుండి 31వరకు రెండో దశలో 3,04,323 మంది అభిప్రాయాలను సేకరించారు.  7,41,965 శాంపిల్స్‌ను సేకరించి శాస్త్రీయంగా సర్వేను నిర్వహించినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన సర్వేలో టీడీపీ కంటే వైసీపీకి 4 శాతం ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా ఆ సర్వే ప్రకటించింది. తాజాగా నిర్వహించిన సర్వేలో టీడీపీ కంటే వైసీపీకి 8 శాతం అధికంగా ఓట్లు వచ్చాయని ఆ సంస్థ ప్రకటించింది. 

2014లో వైసీపీ కేవలం 1.60 శాతం ఓట్లతో వెనుకబడింది. ఈ రెండు పార్టీల మధ్య సుమారు ఐదు లక్షలకు పైగా ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే తాజా సర్వేలో టీడీపీ కంటే వైసీపీకి 8 శాతం ఎక్కువ ఓట్లు దక్కడం వల్ల ఆ పార్టీకి భారీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

వైసీపీకి 48.1 శాతం ఓట్లు వస్తే, టీడీపీకి 40.1 శాతం ఓట్లు రానున్నాయని సీపీఎస్ సర్వే ప్రకటించింది. కాంగ్రెస్ , బీజేపీలు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించే అవకాశాలు ఉండవని ఆ సర్వే ప్రకటించింది.

పవన్ కళ్యాణ్ పార్టీకి 8 శాతం ఓట్లు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే అభిప్రాయపడింది.  ఉభయ గోదావరి జిల్లాలతో పాటు, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా జనసేనకు ఓట్లు వచ్చే అవకాశం ఉందని  సీపీఎస్ సర్వే  అభిప్రాయంతో ఉంది. జనసేన ఒకటి లేదా రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొనే అవకాశం ఉందని సీపీఎస్ సర్వే సంస్థ తేల్చి చెప్పింది.

జగన్ నాయకత్వాన్ని 46 శాతం ప్రజలు కోరుకొంటే చంద్రబాబునాయుడు నాయకత్వాన్ని 39శాతం మంది ఓటర్లు కోరుకొన్నారని సీపీఎస్ సంస్థ చెబుతోంది. డ్వాక్రా సంఘాల్లో 45.2 శాతం వైసీపీకి, 44 శాతం మంది టీడీపీకి అనుకూలంగా ఉన్నారని ఈ సంస్థ తేల్చింది.

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను బూచిగా చూపి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు బాబు చేస్తున్న ప్రచారం పెద్దగా ఉపయోగపడినట్టుగా కన్పించడం లేదని  సర్వే సంస్థ అభిప్రాయపడింది. బాబు సర్కార్ అవినీతికి పాల్పడిందని విపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజల్లో ప్రభావం చూపిందని  ఆ సంస్థ చెబుతోంది. ప్రత్యేక హోదా విషయంలో జగన్‌ వైఖరి పట్ల జనం సానుకూలంగా ఉన్నారని అదే సమయంలో ఈ విషయమై బాబు  యూటర్న్ తీసుకొన్న పెద్దగా టీడీపీకి ప్రయోజనం దక్కలేదని ఈ సంస్థ ప్రకటించింది.

2009  నుండి ఈ సంస్థ నిర్వహించిన ప్రతి సర్వే కూడ వాస్తవ ఫలితాలకు అతి దగ్గరగానే ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ మాసంలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడ సీపీఎస్ సర్వే సంస్థ ఫలితాలకు దగ్గరగానే వాస్తవ ఫలితాలు వచ్చాయి.

click me!