అప్పుడలా: చిట్టచివరికి జగన్ పార్టీలోకే డీఎల్

By narsimha lodeFirst Published Mar 20, 2019, 3:38 PM IST
Highlights

 రాజకీయాల్లో శాశ్వత శతృవులు కానీ,  శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. అందుకే ఎన్నికల ముందు ఒక పార్టీనుండి మరో పార్టీలో చేరే జంప్ జిలానీలు ఎక్కువగా కన్పిస్తారు. 

కడప:  రాజకీయాల్లో శాశ్వత శతృవులు కానీ,  శాశ్వత మిత్రులు కానీ ఉండరని అంటారు. అందుకే ఎన్నికల ముందు ఒక పార్టీనుండి మరో పార్టీలో చేరే జంప్ జిలానీలు ఎక్కువగా కన్పిస్తారు. రాజకీయాల్లో, వ్యక్తిగతంగా కూడ బద్ద శతృవులుగా మెలిగిన వారు కూడ చివరకు ఒకానొక దశలో కలిసిపోతుంటారు. రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూస్తుంటాం. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ జగన్‌పై ఒంటి కాలిపై లేచిన డీఎల్ రవీంద్రారెడ్డి... ఈ ఎన్నికల్లో జగన్‌కు మద్దతు ప్రకటించారు.

కడప జిల్లా మైదుకూరు అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించిన డీఎల్ రవీంద్రారెడ్డి ఈ దఫా మాత్రం టిక్కెట్టు కోసం ప్రధాన రాజకీయ పార్టీల చుట్టూ తిరిగాడు. కానీ, ఏ పార్టీ కూడ ఆయనకు టిక్కెట్టును కేటాయించలేదు. 

అయితే  వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలు బుధవారం నాడు డీఎల్ రవీంద్రారెడ్డితో భేటీ అయ్యారు.ఈ భేటీ తర్వాత డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు ప్రకటించారు. రెండు రోజుల్లో డీఎల్ వైసీపీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది. 

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కడప జిల్లా రాజకీయాల్లో డీఎల్ రవీంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే జిల్లా నుండి ప్రాతినిథ్యం వహించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ  ఓ వర్గాన్ని కాపాడుకొంటూ వచ్చారు. 

2009 సెప్టెంబర్ రెండో తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. 2011 మార్చి 12వ తేదీన జగన్  వైసీపీని ఏర్పాటు చేశారు. ఈ సమయంలో కడప ఎంపీ స్థానానికి జగన్, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేశారు. ఈ సమయంలో ఉప ఎన్నికలు వచ్చాయి.

ఈ ఉప ఎన్నికల సమయంలో కడప జిల్లా నుండి డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. కడప ఎంపీ  స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్ పోటీ చేస్తే ఆయనకు వ్యతిరేకంగా మంత్రిగా ఉన్న డీఎల్ రవీంద్రారెడ్డి జగన్‌కు వ్యతిరేకంగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా మైసూరారెడ్డి బరిలో నిలిచారు. కానీ, ఆ ఎన్నికల్లో జగన్ భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ఆ తర్వాత కూడ జగన్‌కు వ్యతిరేకంగా డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో  డీఎల్ రవీంద్రారెడ్డి  టీడీపీకి మద్దతిచ్చారు.  ఈ ఎన్నికల్లో టీడీపీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకొంది.  ఒకనాడు జగన్‌కు వ్యతిరేకంగా ఇదే జిల్లా నుండి తీవ్రమైన విమర్శలు చేసిన  డీఎల్... ఇప్పుడు అదే జగన్ పార్టీకి మద్దతిస్తానని ప్రకటించారు. 

ఇక డీఎల్ రవీంద్రారెడ్డి 2014 వరకు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరాలని ప్రయత్నించారు.  ఎన్నికల సమయంలో చంద్రబాబును కూడ కలిశారు. 

మైదుకూరు అసెంబ్లీ లేదా కడప ఎంపీ టిక్కెట్టు ఇస్తామనే చర్చ సాగింది. కానీ, మైదుకూరు అసెంబ్లీ టిక్కెట్టు వైపే డీఎల్ రవీంద్రారెడ్డి మొగ్గు చూపారు.డీఎల్ రవీంద్రారెడ్డికి కాకుండా సుధాకర్ యాదవ్‌కే చంద్రబాబు టిక్కెట్టు ఇచ్చారు. దీంతో ఆయన టీడీపీలో చేరలేదు.  ఈ ఐదేళ్లలో చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

వైసీపీ, టీడీపీ నేతలు పలు దఫాలు చర్చలు జరిపారు.  ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీలో చేరాలని భావించారు. సీటు కేటాయించే విషయంలో రెండు పార్టీలు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని భావించారు. బుధవారం నాడు డీఎల్ తో వైసీపీ నేతలు భేటీ అయ్యారు. దీంతో  ఆ పార్టీకి మద్దతిచ్చేందుకు తాను సిద్దమని డీఎల్ ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అవినాష్, సజ్జల భేటీ: వైసీపీలోకి డీఎల్
 

click me!