ముగిసిన ఆన్‌స్క్రీన్ ప్రచారం: ఆఫ్‌స్క్రీన్ స్టార్ట్

By narsimha lodeFirst Published Apr 9, 2019, 6:14 PM IST
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రచారం ముగిసింది. ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన నేతలు ఇక ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు చివరి ప్రయత్నాలను ప్రారంభించారు. 

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో  ప్రచారం ముగిసింది. ప్రత్యర్థులపై నిప్పులు చెరిగిన నేతలు ఇక ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు చివరి ప్రయత్నాలను ప్రారంభించారు. ఏపీ రాష్ట్రంలో కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని చంద్రబాబు నాయుడు సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేశారు.  ఈ ఒక్కసారి తనకు సీఎంగా అవకాశం ఇవ్వాలని జగన్ ఆయన కుటుంబసభ్యులు ప్రచారం నిర్వహించారు. 

మరో వైపు తెలంగాణలో కేసీఆర్, కేటీఆర్‌లు  రాష్ట్ర వ్యాప్తంగా  పర్యటించారు. కేసీఆర్ కంటే ముందుగానే కేటీఆర్‌ ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో  కార్యకర్తల సమావేశాల్లో పాల్గొన్నారు.

ఏప్రిల్ 11వ తేదీన ఏపీ రాష్ట్ర అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజా దర్భార్ పేరుతో ఈ దఫా ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుండి ప్రారంభించారు.

గత నెలలో తిరుపతిలో కార్యకర్తల సమావేశాన్ని పూర్తి చేసుకొని శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో బాబు పాల్గొన్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబునాయుడు విస్తృతంగా పాల్గొన్నారు. ఉదయం నుండి  రాత్రి 10 గంటల వరకు చంద్రబాబునాయుడు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారు.

చంద్రబాబునాయుడుకు మద్దతుగా నేషనల్ కాన్పరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. కర్నూల్, కడప జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభల్లో ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. మరో వైపు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమత బెనర్జీలు కూడ బాబుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ నెల 8వ తేదీన కృష్ణా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభలో జేడీఎస్ చీఫ్ దేవేగౌడ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో డీఎంకే చీఫ్ స్టాలిన్‌తో కూడ ప్రచారాన్ని నిర్వహించాలని బాబు ప్లాన్ చేశారు. కానీ,  తమిళనాడులో ప్రచార కార్యక్రమాల దృష్ట్యా స్టాలిన్ ఏపీలో ప్రచారానికి రాలేకపోయారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మంగళగిరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్ రాష్ట్రంలోని  కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. లోకేష్ తరపున మంగళగిరిలో ఆయన సతీమణి బ్రహ్మిణి ప్రచారం నిర్వహించారు.

కుప్పంలో చంద్రబాబునాయుడు తరపున ఆయన సతీమణి భువనేశ్వరీ ప్రచార బాధ్యతలను తన భుజాన వేసుకొన్నారు. హిందూపురంలో బాలయ్య తరపున ఆయన సతీమణి వసుంధరా దేవి ప్రచారం చేస్తున్నారు. బాలకృష్ణ విశాఖ జిల్లాలో ప్రచారం నిర్వహించారు.టీడీపీ అభ్యర్థుల తరపున సినీ నటుడు నారా రోహిత్ కూడ ప్రచారం నిర్వహించారు.  

ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబునాయుడు సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ ఉపయోగించిన సెంటిమెంట్ అస్త్రాన్ని ఏపీలో కూడ ఉపయోగించే ప్రయత్నం చేశారు. కేసీఆర్‌తో జగన్ కుమ్మక్కై ఏపీకి ఏ రకంగా నష్టం చేస్తున్నారనే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. జగన్, కేసీఆర్‌లు కుమ్మక్కయ్యారని  ప్రచారం చేశారు. 

ఇక వైసీపీ తరపున వైఎస్ జగన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి మధ్య మధ్యలో విరామం కూడ ఇచ్చారు. జగన్‌కు తోడుగా ఆయన తల్లి వైసీపీ చీఫ్ విజయమ్మ, సోదరి షర్మిల కూడ వేర్వేరు రూట్లలో ప్రచారం నిర్వహించారు.

జగన్‌కు మద్దతుగా ఏ పార్టీల నేతలు ప్రచారం చేయలేదు. కానీ, ఈ నెల 8వ తేదీన ఏపీలో జగన్‌ విజయం సాధిస్తారని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబునాయుడు ఏ ఒక్క హామీని అమలు చేయలేదని జగన్  విమర్శలు గుప్పించారు. 

ఒక్కసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిని చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.నవరత్నాలతో పాటు పాదయాత్రలో ఇచ్చిన హమీలను పొందుపర్చిన మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. 

ఈ ఎన్నికల్లో జనసేన, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ కూటమి పోటీ చేస్తోంది. ఈ కూటమి తరపున జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీఎస్పీ చీఫ్ మాయావతి కూడ రెండు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. తిరుపతి, విజయవాడలతో పాటు హైద్రాబాద్‌లలో నిర్వహించిన సభల్లో మాయావతి పాల్గొన్నారు.

ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించే సమయంలో పవన్ కళ్యాణ్  అస్వస్థతకు గురయ్యారు. ప్రచారాన్ని నిలిపివేయాలని వైద్యులు సూచించారు. కానీ, ఆయన ప్రచారాన్ని కొనసాగించారు. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన సమయంలో  మెగా హీరో రామ్‌చరణ్ ఆయనను పరామర్శించారు. ఈ నెల 9వ తేదీన  పాలకొల్లులో నిర్వహించిన ఎన్నికల సభలో నాగబాబు, పవన్ కళ్యాణ్‌తో కలిసి అల్లు అర్జున్  పాల్గొన్నారు.

ప్రజా శాంతి పార్టీ తరపున ఆ పార్టీ చీఫ్  కేఏ పాల్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో తన చేష్టలతో ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు.ఫన్నీ కామెంట్స్,తో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.

ఇక తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో అధికార టీఆర్ఎస్ తరపున కేసీఆర్, కేటీఆర్‌ లు విస్తృతంగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కూడ రెండు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

తెలంగాణలోని 13 స్థానాల్లో ఇవాళ నాలుగు గంటలకే ప్రచారం ముగిసింది. నిజామాబాద్ ఎంపీ స్థానంలో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారం చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఏపీలో కూడ సాయంత్రం ఆరు గంటల వరకు ప్రచారం నిర్వహించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో ఓటర్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు అన్ని పార్టీలు అన్ని రకాల మార్గాలను  ఉపయోగించుకొంటున్నారు. 

పోలింగ్‌కు ఇక రెండు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో ఈ రెండు రోజుల్లో ఫలితం తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు విశ్వప్రయత్నాలను చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అన్ని రకాల మార్గాలను ఉపయోగించుకొంటున్నారు.

click me!