
హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సుజానా చౌదరికి ఈడీ భారీ షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఫ్రాడ్ కేసుకు సంబంధించి రూ.315 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
సుజనా చౌదరి ఆస్తులపై ఇటీవలే ఈడీ సోదాలు చేసింది. అయితే సుజనా చౌదరి షెల్ కంపెనీల ద్వారా భారీగా నిధులు బదలాయింపు జరిగిందని ఈడీ గుర్తించింది. సుజనా గ్రూప్ సంస్థ బీసీఈపీఎల్ కంపెనీ ద్వారా రూ.364 కోట్లు రుణం తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది.
బీసీఈపీఎల్ కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ షెల్ కంపెనీలను గుర్తించింది. అనంతరం ఆ కేసును ఈడీకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ సుజనా గ్రూప్ సంస్థలు, సుజనా చౌదరి ఆస్తులపై సోదాలు నిర్వహించింది.పెద్ద మెుత్తంలో షెల్ కంపెనీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది.
షెల్ కంపెనీల ద్వారా డబ్బులు వైస్రాయ్ హోటల్, మహాల్ హోటల్ కి బదిలీ చేసినట్లు ఈడీ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో వైస్రాయ్ హోటెల్ కి సంబంధించి ఆస్తులను జప్తు చేసింది.
ఇకపోతే చెన్నైలోని ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ నుంచి షెల్ కంపెనీల పేరుతో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సొమ్మును బీసీఈపీఎల్ కంపెనీ సుజనా కంపెనీలకి బదిలీ చేసిందని సమాచారం. చెన్నై, బెంగళూరులోని ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.