విశాఖలో క్రాస్ ఓటింగ్..జేడి గెలుపు ఖాయమా?

By ramya nFirst Published Apr 12, 2019, 10:07 AM IST
Highlights

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. కాగా.. విశాఖ లోక్ సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. 

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరిగింది. కాగా.. విశాఖ లోక్ సభ స్థానం పరిధిలో క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రాస్ ఓటింగ్.. జనసేన ఎంపీ అభ్యర్థి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు కలిసొచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమౌతోంది.

పోలింగ్ జరగడానికి ముందు వరకు.. విశాఖ నుంచి బరిలోకి దిగిన జనసేన అభ్యర్థుల్లో పవన్ తప్ప.. గట్టి పోటీ ఇచ్చే వ్యక్తి ఒక్కరు కూడా కనిపించలేదు. దానికి తోడు టీడీపీ, వైసీపీ నుంచి పోటీకి దిగిన అభ్యర్థులు చాలా బలవంతులు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే.. పోలింగ్ తర్వాత మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ఎక్కువ ఓట్లు పోలైనట్లు సమాచారం. జగన్‌ కేసులను ధైర్యంగా దర్యాప్తు చేశారన్న ముద్ర ఆయనకు బాగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది. స్థానికుడు కాదన్న ప్రచారాన్ని ఎదుర్కొన్నా.. తాను విశాఖ వదిలి వెళ్లనని, ఇక్కడే ఇల్లు తీసుకున్నానని తేల్చి చెప్పారు. తను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తనపై కేసులు కూడా వేసుకోవచ్చని వందరూపాయల బాండ్‌ పేపర్‌పై హామీలన్నీ రాసి ఆ పత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ అందుబాటులో ఉంచారు.

 నగరంలో ఉంటున్న ఇతరరాష్ట్రాల ఓటర్లతో వారివారి భాషల్లో మాట్లాడడం కూడా ఆయనకు కలిసివచ్చినట్టు తెలుస్తోంది. నగరంలో ఎలా ఉన్నా గ్రామీణ ప్రాంతాల వారికి లక్ష్మీనారాయణ పెద్దగా తెలియరని కొంతమంది భావించినా.. అక్కడా క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు స్పష్టమవుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే.. ఫలితాలు విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

click me!