కేసీఆర్ కావాలో, చంద్రబాబు కావాలో తేల్చుకోండి: చంద్రబాబు

By telugu teamFirst Published Mar 10, 2019, 9:36 PM IST
Highlights

హైదరాబాదులోని లోటస్ పాండులో ఉండి రాజకీయాలు చేసే వారికి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే హక్కు లేదని, తెలంగాణలోనే పోటీ చేయాలని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. దొరల పాలన కావాలా అని ఆయన ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో అడిగారు.

అమరావతి:  తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. కేసీఆర్ కావాలో, చంద్రబాబు కావాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఆంధ్రవాళ్ల పాలన కావాలో, తెలంగాణవాళ్ల పాలన కావాలో తేల్చుకోవాలని ఆయన అన్నారు. 

హైదరాబాదులోని లోటస్ పాండులో ఉండి రాజకీయాలు చేసే వారికి ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసే హక్కు లేదని, తెలంగాణలోనే పోటీ చేయాలని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. దొరల పాలన కావాలా అని ఆయన ఆదివారం రాత్రి మీడియా సమావేశంలో అడిగారు. చదువు లేదు, సంస్కారం లేదు, మోడీకీ కేసీఆర్ కీ ఊడిగం చేస్తారా అని ఆయన జగన్ ను అడిగారు. ఎపిలో లేనివాళ్లకు ఓట్లు అడిగే హక్కు కూడా లేదని అన్నారు 

వైఎస్సార్ కాంగ్రెసు ఐదో, పదో లోకసభ సీట్లు గెలుచుకుంటే, వాటిని కేసీఆర్ తన ఖాతాలో వేసుకుని ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా పనిచేస్తారని ఆయన అన్నారు. వైసిపి తప్పుడు సర్వేలు ముందుకు తెచ్చి మనమే గెలిచిపోతున్నామని చెబుకుంటోందని అన్నారు. కేసీఆర్ పోలీసు రాజ్యం తెచ్చి అభివృద్ధి పనులు చేయకుండా మనపై కూడా ప్రయోగిస్తున్నారని ఆయన అన్నారు. ఎపి అభివృద్ధి అయితే భరించలేడని ఆయన అన్నారు 

తాను అమరావతికి బస్సులో వచ్చానని, ఏకపక్ష విభజన వల్ల ఎపి చాలా నష్టపోయిందని, మన ఆత్మగౌరవాన్ని దెబ్బి తీసే విధంగా నానా తిట్లు తిట్టే పరిస్థితికి వచ్చారని ఆయన అన్నారు నానా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి వచ్చారని అన్నారు  

మీ భవిష్యత్తు, నా భరోసా అనేది తన నినాదమని చంద్రబాబు చెప్పారు. తాను విజన్ కూడా ఇచ్చానని ఆయన చెప్పారు వచ్చే ఐదేళ్లలో తాము ఏం చేయబోతామనే విజన్ అది అని ఆయన అన్నారు, అది జరగకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఆంధ్రులను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మన మనోభావాలు దెబ్బ తినే విధంగా మాట్లాడడం ఎంత వరకు సబబు అని ఆయన అన్నారు. 

ప్రజలను రెచ్చగొట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నారని ఆయన టీఆర్ఎస్ ను ఉద్దేశించి అన్నారు. తాను ఐదేళ్లు కష్టపడి అన్నీ చదువుకున్నానని, తనకు ఈ ఎన్నికలు పరీక్ష అని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు నవ్యాంధ్రకు అగ్నిపరీక్ష అని ఆయన అన్నారు.  తొమ్మిది నెలల్లో సచివాలయం, అసెంబ్లీ నిర్మించానని ఆయన అన్నారు. 

తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తే, తమ ఉనికిని ప్రశ్నిస్తే ఏం చేయాలో తనకు తెలుసునని అన్నారు. మీరు బెదిరిస్తే భయపడేది లేదని అన్నారు. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇల్లు మీకు అంతే దూరమని, మీ హద్దుల్లో మీరు ఉండాలని ఆయన టీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. 

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను వాళ్లే ఖరారు చేస్తున్నారని ఆయన కేసిఆర్ ను ఉద్దేశించి అన్నారు. ఐదేళ్లయినా వైసిపి ఇంకా హైదరాబాదులోనే ఉందని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆర్థిక మూలాలున్న వారిపై ఒత్తిడి తెచ్చి వైసిపిలో చేర్పిస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాదులో ఉండి కేసుల కోసం లాలూచీపడ్డారని చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. 

తెలుగుదేశం లేకపోతే కేసీఆర్ ఎక్కడున్నాడని ఆయన అడిగారు. నువ్వెవ్వరు అని ఆయన కేసిఆర్ ను ఉద్దేశించి అన్నారు. తన వద్ద పనిచేసినవాళ్లకే అంత తెలివితేటలు ఉంటే తనకు ఎన్ని తెలివితేటలు ఉండాలని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. వ్యక్తులు వ్యక్తులుగా దూరంగా ఉందామని, అలా కాకపోతే ఏం చేయాలో తనకు తెలుసునని అన్నారు. వాళ్లకు ఊడిగం చేసే జగన్ కు ఓటు వేయాలా అని ఆయన అడిగారు. 

కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు పనిచేయవని, కేసీఆర్ వ్యూహం తెలంగాణలో పనిచేస్తుంది గానీ తన వద్ద పనిచేయదని అన్నారు. ఎపిలో వన్ సైడ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని అన్నారు. ఓట్లు ఉన్నాయో లేదో ప్రజలు సరిచూసుకోవాలని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు తన కోసం కాదని, ప్రజల కోసమని ఆయన అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కు సహకరిస్తున్నామని జగన్ చెబుతున్నారని, ప్రత్యేక హోదా అభ్యంతరం లేదని కేసిఆర్ తో జగన్ లేఖ రాయించాలని ఆయన అన్నారు .

కేసీఆర్ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్రం అన్యాయం చేస్తుంటే వారికి మద్దతు ఇచ్చే జగన్ కు ఎపిలో పోటీ చేసే హక్కు లేదని అన్నారు. మోడీ మట్టి, నీళ్లు తీసుకుని వచ్చి ముఖం మీద కొడితే తాను రూ.500 కోట్లు ఇద్దామని అనుకున్నానని చెప్పి కేసిఆర్ ఎగతాళి చేస్తాడా అని ఆయన ప్రశ్నించారు. అది మనం కష్టపడి ఇచ్చి డబ్బు మాత్రమేనని అన్నారు. తనకు కేసిఆర్ ఒక్క గిఫ్ట్ ఇస్తే, కేసీఆర్ కు తాను వంద గిఫ్ట్ లు ఇస్తానని ఆయన చెప్పారు. తాను తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తానని అన్నారు. 

click me!