దాడి ఎఫెక్ట్: గుడివాడ అమర్‌కు ఏ టిక్కెట్టు దక్కునో

By narsimha lodeFirst Published Mar 10, 2019, 3:33 PM IST
Highlights

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన  ఇద్దరు కొడుకులు రత్నాకర్, జయవీర్‌లు వైసీపీలో చేరడంతో  విశాఖ జిల్లాలోని వైసీపీలో  సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
 


విశాఖపట్టణం: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన  ఇద్దరు కొడుకులు రత్నాకర్, జయవీర్‌లు వైసీపీలో చేరడంతో  విశాఖ జిల్లాలోని వైసీపీలో  సమీకరణాలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రెండు రోజుల క్రితం మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. గత ఎన్నికలకు ముందు టీడీపీ నుండి  వైసీపీలో చేరారు. దాడి వీరభద్రరావు తనయుడు  రత్నాకర్ పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. 

 ఆ తర్వాత దాడి వైసీపీకి గుడ్‌ బై చెప్పారు.కొంత కాలం తర్వాత దాడి వీరభద్రరావు టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ, టీడీపీ నాయకత్వం మాత్రం దాడి వీరభద్రరావుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడ దాడితో కలిశారు. చాలా కాలం వరకు తటస్థంగా ఉన్న దాడి వీరభద్రరావు రెండు రోజుల క్రితం వైసీపీలో చేరారు.

వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుండి పోటీ చేయాలని వైసీపీ నాయకత్వం దాడి వీరభద్రరావును కోరుతోంది. కానీ అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు దాడి వీరభద్రరావు కుటుంబం ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం.

అనకాపల్లి టిక్కెట్టును దాడి కుటుంబానికి కేటాయిస్తే  ఇప్పటివరకు ఈ స్థానానికి సమన్వయకర్త గుడివాడ అమర్‌కు ఏ స్థానాన్ని కేటాయించనున్నారనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది. 

అనకాపల్లి నుండి గతంలో దాడి వీరభద్రరావు ప్రాతినిథ్యం వహించారు. దీంతో అసెంబ్లీ వైపే ఆయన కుటుంబం మొగ్గు చూపుతోంది.దాడి కుటుంబం వైసీపీలో చేరడంతో అనకాపల్లి టిక్కెట్టు విషయాన్ని పెండింగ్‌లో పెట్టారు. అనకాపల్లి అసెంబ్లీ టిక్కెట్టును దాడి కుటుంబానికి కేటాయిస్తే గుడివాడ అమర్‌కు పెందుర్తి టిక్కెట్టును ఇచ్చే అవకాశాలున్నట్టుగా ప్రచారం సాగుతోంది. 

పెందుర్తి టిక్కెట్‌ వెలమ సామాజిక వర్గానికే ఇవ్వాల్సి ఉన్నందున గాజువాక నుంచి అమర్‌ను పోటీకి దింపాలని కొందరు వైసీపీ నేతలు పార్టీ నాయకత్వం వద్ద ప్రస్తావించినట్టు సమాచారం.టిక్కెట్ల కేటాయింపు సామాజిక సమతుల్యతను పాటించాలని కూడ  పార్టీ నేతలు చెబుతున్నారు.
 

click me!