ఈసీతో భేటీ సంతృప్తిని ఇవ్వలేదు: ధ్వజమెత్తిన చంద్రబాబు

By telugu teamFirst Published Apr 13, 2019, 2:44 PM IST
Highlights

సునీల్ ఆరోరాకు చంద్రబాబు 18 పేజీల లేఖను అందజేశారు. ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏకపక్షంగా ఈసి అధికారులను బదిలీ చేసిందని, దీనిపై ప్రశ్నిస్తే ఈసి వద్ద సమాధానం లేదని ఆయన అన్నారు.

న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ (ఈసి)పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈసి అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ప్రధాని నరేంద్ర మోడీ దర్శకత్వంలో ఈసి పనిచేసిందని ఆయన విమర్శించారు. ఆయన శనివారంనాడు ప్రధాన ఎన్నికల కమిషర్ సునీల్ అరోరాను కలిశారు.  సీఈసీతో సమావేశం సంతృప్తిని ఇవ్వలేదని ఆయన అన్నారు. 

సునీల్ ఆరోరాకు చంద్రబాబు 18 పేజీల లేఖను అందజేశారు. ఈవీఎంలు, ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏకపక్షంగా ఈసి అధికారులను బదిలీ చేసిందని, దీనిపై ప్రశ్నిస్తే ఈసి వద్ద సమాధానం లేదని ఆయన అన్నారు. జగన్ కేసులో నిందితుడైన సుబ్రహ్మణ్యాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించిందని ఆయన అన్నారు. 

ప్రతిపక్షాలన్నీ ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడుతున్నాయని ఆయన అన్నారు. తమ పార్టీ మాత్రమే కాకుండా అన్ని పార్టీలు కూడా ఈవిఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు తన ఓటే తన పార్టీకి పడిందో లేదో తెలియలేదంటే సామాన్యుల పరిస్థితేమిటని ఆయన అడిగారు. 

ఈవీఎంలపై చాలా కాలంగా పోరాడుతున్నామని, ఈ పోరాటం కొనసాగుతుందని, ఈ రోజు రేపు అన్ని పార్టీల నాయకులను కలుస్తానని ఆయన చెప్పారు. మోడీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నింటినీ దుర్వినియోగం చేసిందని, సీఈసిని కూడా తన చెప్పుచేతల్లో పెట్టుకుందని ఆయన అన్నారు ప్రజల హక్కును కాపాడడంలో ఈసీ విఫలమైందని ఆయన అన్నారు. ప్రాథమిక సూత్రాలను కూడా ఉల్లంఘించారని ఆయన అన్నారు. 

ప్రజల హక్కును కాపాడడంలో ఈసి విఫలమైందని ఆయన విమర్శించారు. ఎన్నికలు నిర్వహించే పద్ధతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. తాము పేపర్ బ్యాలెట్ తో ఎన్నికలను నిర్వహించాలని కోరితే పట్టించకోలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంపై మూకుమ్మడి దాడిని నిరసించామని ఆయన చెప్పారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. రౌడీలంతా వీధుల మీదికి వచ్చారని, ప్రజా జీవనం స్తంభించిందని ఆయన అన్నారు.

click me!