వైసీపీ ఏది చెబితే అది చేస్తుంది: ఈసీపై చంద్రబాబు ఫైర్

By Siva KodatiFirst Published Apr 10, 2019, 2:03 PM IST
Highlights

మొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఎన్నికల సంఘానికి సంబంధించి సీఈవోను కలిసిన సంఘటన ఏపీలో జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు

మొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఎన్నికల సంఘానికి సంబంధించి సీఈవోను కలిసిన సంఘటన ఏపీలో జరిగిందన్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీలో ఎన్నికల సంఘం తీరుపై ఈయన రాష్ట్ర సీఈవో ద్వివేదికి ఫిర్యాదు చేశారు.

అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలపై నమ్మకం లేదని, బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలని 22 రాజకీయ పార్టీలు ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు చేశాయని చంద్రబాబు గుర్తు చేశారు.

వీవీ ప్యాట్‌లు కనీసం 50 శాతం లెక్కించాలంటే దానిని ఈసీ తిరస్కరించిందన్నారు. బ్యాలెట్ బాక్స్‌లో ఉండే బ్యాలెట్ పేపర్లను లెక్కించడానికి ఆరు రోజులు పడుతుందంటూ ఈసీ తప్పుడు సమాధానం చెప్పిందని చంద్రబాబు దుయ్యబట్టారు.

చివరికి ఐదు బ్యాలెట్ బాక్సులు లెక్కిస్తామని ఈసీ అంగీకారం తెలిపిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఫాం 7 ద్వారా పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తోందంటూ టీడీపీపై వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసిందని ఆ ఫిర్యాదు కింద యాక్షన్ ప్లాన్ ఉందన్నారు.

తెలంగాణలో 25 లక్షల ఓట్లు తొలగించి చిన్న సారీతో సరిపెట్టారని బాబు మండిపడ్డారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే శ్రీకాకుళం కలెక్టర్‌ను ట్రాన్స్‌ఫర్ చేశారని.. ఆ అధికారం ఈసీకి ఎక్కడుందని సీఎం ప్రశ్నించారు.

వివేకా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి పెద్ద డ్రామా ఆడారని... కేసులో నిజానిజాలు బయటకు రాకుండా కడప ఎస్పీని ట్రాన్స్‌ఫర్ చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. 

ఏపీ రాష్ట్రంలో అధికారుల బదిలీల విషయంలో కనీసం అధికారుల వివరణ కూడ తీసుకోలేదని బాబు మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వివరణ ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 

వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల మీద ఈసీ చర్యలు తీసుకొందన్నారు. కానీ, తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్క పౌరుడు తీసుకోవాలని  చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.

click me!