
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాపై వేటు వేసింది.
పునేఠాను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. ఆయనను ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని ఆదేశించింది. కొత్త సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త సీఎస్ గా నియమితులైన ఎల్వీ సుబ్రహ్మణ్యం 1983వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన ప్రస్తుతం స్పెషల్ చీఫ్ సెక్రటరీ యూత్ సర్వీసెస్ పోస్ట్ లో కొనసాగుతున్నారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం శనివారం ఉదయం 10 గంటలకు నూతన సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఇటీవల రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్‌ల బదిలీల విషయంలో సీఎస్‌ను పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించింది. ఐపీఎస్‌ల బదిలీ అంశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటవెంటనే విడుదల చేసిన జీవోలపై వివరణ కోరింది.
అనంతరం ఐపీఎస్ అధికారుల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్నికల విధులకు దూరంగా ఉంటున్న ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు కేసులో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తంచేసింది.
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవని స్పష్టం చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఎన్నికల విధుల్లో లేరని జీవోలో పేర్కొనడం అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అనిల్ చంద్ర పునేఠాను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తోపాటు పలువురు ఐపీఎఎస్ అధికారులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతోపాటు, కడప, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ డీజీపీ ఠాకూర్ ను వివరణ కోరింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ వెళ్లిన ఆర్పీ ఠాకూర్ రెండురోజులపాటు అక్కడే ఉండి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇచ్చారు. ఆయనపై కూడా వేటు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు ఐపీఎస్ అధికారుల వేటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్రప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. తాజాగా ఏకంగా సీఎస్ అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసిన నేపథ్యంలో ఎలా స్పందిస్తుందో అన్నది వేచి చూడాలి. ఐపీఎస్ ల బదిలీలపై కోర్టుకు వెళ్లిన రాష్ట్రప్రభుత్వం సీఎస్ బదిలీపై ఎలా రియాక్ట్ అవుతారా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది.