జగన్ వస్తే ఆయనే ఇంటలిజెన్స్ చీఫ్: ఎపికి తిరిగి వస్తున్న ఐపిఎస్

By telugu teamFirst Published May 8, 2019, 10:40 AM IST
Highlights

1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఆంజనేయులు డిప్యూటేషన్ పై బిఎస్ఎఫ్ ఐజిగా పనిచేస్తున్నారు. తనను ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని ఆయన పెట్టుకున్న విజ్ఢప్తిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకరించింది. 

హైదరాబాద్: ఎన్నికల ఫలితాలు వెలువడడానికి సమయం దగ్గర పడుతున్నకొద్దీ అధికారులు విషయంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) ఐడిగా ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 

1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఆంజనేయులు డిప్యూటేషన్ పై బిఎస్ఎఫ్ ఐజిగా పనిచేస్తున్నారు. తనను ఆంధ్రప్రదేశ్ కు పంపించాలని ఆయన పెట్టుకున్న విజ్ఢప్తిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకరించింది. డిప్యూటేషన్ గడువు పూర్తి కాక ముందే ఆయనను ఎపికి పంపడానికి మే 3వ తేదీన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 

కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఆంజనేయులు డిప్యుటేషన్ గడువు ముగియడానికి ఇంకా కొన్ని నెలలు సమయం ఉంది. అయినప్పటికీ ముందుగానే ఆయనను ఎపికి పంపించడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. సాధారణంగా డిప్యుటేషన్ పై ఉన్న అధికారిని గడువు ముగియకుండానే మాతృసంస్థకు పంపించడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒక్కటి ఆ అధికారి విన్నవించుకోవడం, రెండోది పాలనాపరమైంది. ఆయన విజ్ఞప్తిపైనే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎపికి పంపిస్తోంది. 

వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంజనేయులు నిఘా విభాగం డిఐజిగానూ విజయవాడ పోలీసు కమిషనర్ గానూ పనిచేశారు. 2015 ఏప్రిల్ లో ఆయన సెంట్రల్ డిప్యుటేషన్ పై వెళ్లారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఆంజనేయులను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది.

click me!