
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గడ్డుకాలాన్ని ఎదుర్కుంటున్నట్లే ఉన్నారు కేంద్రంపై ఆయన ఒంటరి పోరాటం చేస్తున్నారు. తనకు కళ్లూచెవులూ అయినవారు కూడా చంద్రబాబుకు దూరమవుతున్నారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్ అధికారులు దూరమయ్యారు. తనయుడు, మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నారో ఎవరికీ తెలియడం లేదు. తండ్రి పక్కన కనిపించడం లేదు. లోకేష్ విదేశాలకు వెళ్లాడని కొంత మంది అంటున్నారు. చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రులైన ఐఎఎస్ అధికారి సతీష్ చంద్ర, ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వర రావు దీర్ఘకాలిక సెలవుపై విదేశాలకు వెళ్లిపోాయరు.
గత రాత్రే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ బయలుదేరి వెళ్లారు. కాగా, లోకేష్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారని అంటున్నారు. ఆయన విదేశాలకు వెళ్లాడని కొందరంటున్నారు. కానీ ఆయన ఎక్కుడున్నారనే విషయం ఎవరికీ తెలియదు.
మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఆ తర్వాత ఆ నియోజకవర్గం ప్రజలకు కూడా కనిపించడం లేదు. ఆయన ప్రత్యర్థి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి మాత్రం ప్రజల్లోనే ఉంటున్నారు.
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఎబి వెంకటేశ్వర రావు వ్యక్తిగత పనులపై యునైటెడ్ కింగ్ డమ్ వెళ్లారు. మే 6వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. నిఘా విభాగం చీఫ్ గా ఉన్న ఎబి వెంకటేశ్వర రావును ఎన్నికల సమయంలో ఈసి బదిలీ చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ చేసిన ఆరోపణతో ఆయనను ఈసి బదిలీ చేసింది. ఆ తర్వాత ఆయన ఎసిబీ చీఫ్ గా నియమితులయ్యారు
చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన మరో ఉన్నతాధికారి సతీషథ్ చంద్ర కూడా దీర్షకాలిక సెలవుపై విదేశాలకు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సింగపూర్, మలేషియాల్లో విహారయాత్రకు వెళ్లారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు కోసం వ్యూహాలను రచించినవారిలో సతీష్ చంద్ర అత్యంత కీలకమైనవారని అంటారు.
ఈ స్థితిలో రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. వైఎస్ జగన్ కు ఫలితాలు అనుకూలంగా వస్తాయనే సంకేతాల వల్లనే ఇలా జరుగుతోందనే మాట వినిపిస్తోంది.