బాబు పాలనలో లంచం లేనిదే... పని జరగదు: వైఎస్ జగన్

By Siva KodatiFirst Published Mar 19, 2019, 1:22 PM IST
Highlights

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో లంచం లేనిదే ఏ పని జరగడం లేదని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కోయ్యలగూడెంలో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో లంచం లేనిదే ఏ పని జరగడం లేదని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా కోయ్యలగూడెంలో జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.

చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం చేసిన సంతకాలకు దిక్కు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. 3648 కిలోమీటర్ల పాదయాత్రలో తాను మీతో నడిచానని, మీ కష్టాలు విన్నానని, బాధలను అర్ధం చేసుకున్నాని జగన్ తెలిపారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులు, పెన్షన్‌లు తీసేశారని జన్మభూమి కమిటీల పేరుతో ఓ మాఫియాను తీసుకొచ్చారని ఆరోపించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకుండానే.. చేసేసినట్లు ముఖ్యమంత్రి శాలువాలు కప్పుకున్నారన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్న రైతన్నలకు రూ.12,500 చేతుల్లో పెడతామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులు ఆకస్మికంగా మరణించినా, ప్రమాదవశాత్తూ చనిపోయినా, ఆత్మహత్యలు చేసుకున్నా రూ.7 లక్షల డబ్బుతో ఆర్ధిక సాయం చేస్తామని.. ఇందుకోసం అసెంబ్లీలో చట్టం చేస్తామని జగన్ తెలిపారు. 

click me!