
కడప టీడీపీ అభ్యర్థి అమీర్ బాబు బోరున ఏడ్చేశారు. పార్టీ కోసం తాను తనకు ఉన్నందంతా ఖర్చు పెట్టానని.. ఇప్పుడు తనకు అవసరమైనప్పుడు.. సాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం అమీర్ బాబు కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ నేతలే తనకు న్యాయం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతలోనే.. తన బాధను కంట్రోల్ చేసుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నారు. పార్టీలో దోచుకున్నవాళ్లు దోచుకుంటున్నారని, జెండా మోసేవాళ్లు ఇంకా మోస్తూనే ఉన్నారని అమీర్‌బాబు అన్నారు.
కార్యకర్తలను పట్టించుకోని నాయకులు ఎందుకని ప్రశ్నించిన అమీర్‌బాబు...ఇన్నాళ్లుగా అధిష్టానం తననూ ఏమీ పట్టించుకోలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు ఎంపీ ఆదినారాయణరెడ్డిపైనా అమీర్ బాబు ఇంతెత్తున లేచారు. మాకేం చేశారని మీకు మద్దతు ఇవ్వాలంటూ మంత్రి ఆదిని సూటిగా ప్రశ్నించారు.