సీక్రెట్ అవగాహన: గాజువాకకు బాబు, మంగళగిరికి పవన్ దూరం

By telugu teamFirst Published Apr 7, 2019, 9:07 AM IST
Highlights

ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే, శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు గాజువాకకు దూరంగా ఉన్నారు. 

విశాఖపట్నం: పోలింగ్ తేదీ సమీపించడంతో రాజకీయ పార్టీల అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే, శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు గాజువాకకు దూరంగా ఉన్నారు. 

నిజానికి, గాజువాక శాసనసభ నియోజకవర్గంలో ఆయన ప్రచార కార్యక్రమం ముందుగా ఖరారైంది. కానీ చివరి నిమిషంలో ఆయన తన కార్యక్రమాన్ని మార్చుకున్నారు. తాను పర్యటిస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయావకాశాలు దెబ్బ తింటాయనే ఉద్దేశంతో చంద్రబాబు తన షెడ్యూల్ ను మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గాజువాకలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

అదే తరహాలో జనసేన మంగళగిరిలో ప్రచారం చేయడం లేదు. మంగళగిరి నుంచి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందనే పుకార్లు షికారు చేయడం మరింతగా పెరిగింది. 

అది టీడీపి, జనసేన మధ్య అవగాహనకు నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. అయితే, ఆ పుకార్లను జనసేన నాయకుడు వీవీ లక్ష్మినారాయణ తోసి పుచ్చారు. తాము ఎలాగూ గెలిచేది లేదనే ఉద్దేశంతో చంద్రబాబు గాజువాక ప్రచారానికి వెళ్లలేదని, అదే రీతిలో మంగళగిరిలో తాము గెలుస్తామనే విశ్వాసం ఉంది కాబట్టి తాము అక్కడ ప్రచారం చేయడం లేదని ఆయన అన్నారు. 

టీడీపి, జనసేన మధ్య రహస్య అవగాహన ఉందనే విమర్శను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని గాజువాక టీడీపి అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు అన్నారు. ఇతర ప్రాంతాల్లో ప్రచారానికి తగిన సమయం దొరకదనే ఉద్దేశంతో చంద్రబాబు గాజువాకకు రాలేదని ఆయన అన్నారు. తాము ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఆ విధమైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. 

click me!