కేసీఆర్ ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తే.. నేను వందిస్తా: చంద్రబాబు

By Siva KodatiFirst Published Mar 24, 2019, 4:17 PM IST
Highlights

సీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వంద రిటర్న్ గిఫ్ట్‌లిస్తామని.. మన మీద పెత్తనం చేయడానికి కేసీఆర్ ఎవరని సీఎం ప్రశ్నించారు. 

ప్రధాని మోడీ, ఆర్బీఐ, బ్యాంకులు సహకరించకపోయినా రైతులకు రుణమాఫీ అమలు చేశానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం కడప జిల్లా బద్వేల్‌లో బహిరంగసభలో ప్రసంగించారు.

కడప జిల్లా దేవుని గడప అని కాని ఇప్పుడు కడప జిల్లా రాక్షసుని గడపగా మారిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఐదేళ్ల కాలంలో కాలువలు, రిజర్వాయర్ల దగ్గరే పడుకున్నానని, వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడానికి చెక్‌ డ్యాంలు, ఫాం పాండ్స్‌ను నిర్మించానని తెలిపారు.

నదుల అనుసంధానం ద్వారా 62 ప్రాజెక్టులు నిర్మించామని సీఎం వెల్లడించారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన తర్వాతే కుప్పంకు నీరు విడుదల చేశామన్నారు. నరేంద్రమోడీ నమ్మించి నమ్మక ద్రోహం చేశారని చంద్రబాబు మండిపడ్డారు.

మీ వెంట ఉంటానని వెంకన్న సాక్షిగా తిరుపతిలో హామీ ఇచ్చారని..కానీ మాట మీద నిలబడలేదని సీఎం తెలిపారు. మోడీకి నాకు వ్యక్తిగత వైరం లేదని అయితే 2002లో గోద్రా ఘటన తర్వాత మోడీని రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశానని గుర్తుచేశారు.

ప్రత్యేకహోదా ఇవ్వమని అడిగినందుకు మోడీ.. టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఢిల్లీకి కడప పౌరుషానికి పోరు అన్న వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడని ప్రశ్నించారు.

మోడీని చూస్తే వెన్నులో వణుకన్నారు. విభజన సమయంలో టీఆర్ఎస్ నాయకులు ఆంధ్రుల్ని భయభ్రాంతులకు గురిచేశారన్నారు. కేసీఆర్ ఒక్క రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వంద రిటర్న్ గిఫ్ట్‌లిస్తామని.. మన మీద పెత్తనం చేయడానికి కేసీఆర్ ఎవరని సీఎం ప్రశ్నించారు.  

వివేకా హత్య కేసులో జగన్ డ్రామాలు ఆడారని, ఆయన మామ తన ఆసుపత్రి నుంచి వైద్యులను తీసుకొచ్చి శవానికి కట్లు కట్టించారని ఎద్దేవా చేశారు. వైసీపీ రాష్ట్రంలో చాలామంది ఓట్లు తీసేసిందని.. నా ఓటైనా వుందో లేదో తెలియడం లేదన్నారు.

జగన్‌కు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని... తెలంగాణ పోలీసుల మీద గట్టి నమ్మకముందని సీఎం ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ఉన్న ఏకైక సమస్య జగన్మోహన్ రెడ్డేనని ధ్వజమెత్తారు. తెలంగాణలో 17 సీట్లు, జగన్ సీట్లు కలుపుకుని దేశంలో కేసీఆర్ చక్రం తిప్పుతానని చెబుతానంటున్నారన్నారు. 

click me!