అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారు, లోకేశ్ బయటకు రావాలి: బుగ్గన

By Siva KodatiFirst Published Mar 8, 2019, 2:51 PM IST
Highlights

ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. డేటా లీక్‌పై ఆయన ఇవాళ హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు

ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్‌ను ఎందుకు దాచి పెట్టారని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. డేటా లీక్‌పై ఆయన ఇవాళ హైదరాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఫామ్ 7 అప్లయ్ చేయడం నేరం కాదని ఎన్నికల సంఘం అధికారులే చెబుతున్నా చంద్రబాబు నాయుడు ఎందుకింత కంగారు పడుతున్నారని బుగ్గాన ప్రశ్నించారు.

డేటా చోరీపై ఇంత వరకు స్పష్టమైన సమాధానాలు చెప్పని చంద్రబాబు...హడావుడిగా రెండు జీవోలు మాత్రం జారీ చేశారని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం సేవా మిత్ర యాప్, ఫామ్ 7కు సంబంధించి రెండు సిట్‌లను ఏర్పాటు చేసిందన్నారు.

ఏపీలో నకిలీ ఓట్లు ఉన్న విషయాన్ని తమ పార్టీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లిందని పునరుద్ఘాటించారు. నకిలీ ఓట్లు తొలగించమనే ఫారమ్ 7ను ఎన్నికల సంఘం అప్‌లోడ్ చేసిందని, దీనిపై టీడీపీకి ఉన్న అభ్యంతరం ఏంటో తమకు అర్థం కావడం లేదని రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

సేవామిత్ర యాప్‌తో చంద్రబాబు నిండా మునిగిపోయారని.. ఆ కేసును డైవర్ట్ చేయడానికి ఫామ్ 7పై 300కు పైగా కేసులు నమోదు చేశారని ఆయన మండిపడ్డారు. ఈ తతంగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నికల సంఘం నెరవేర్చాల్సిన బాధ్యతను కూడా టీడీపీ తీసుకుందేమోనని ఆయనన్నారు.

సేవామిత్రలో 30 లక్షల మంది సమాచారం టీడీపీ వారిది అనుకుంటు 3 కోట్ల మంది ప్రజల సమాచారం ఎవరు ఇచ్చారని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. అశోక్‌ను విచారిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

లోకేశ్‌ ట్వీట్లు మానేసి.. బయటికి రావాలని బుగ్గన డిమాండ్ చేశారు. మరో మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందనగా దొంగ చాటుగా 100 జీవోలు ఇచ్చారని మండిపడ్డారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు వైఖరిని తప్పు పడుతున్నారని.. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రికి ప్రజలే గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.  

click me!