
విజయవాడ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసిన మాజీ శాసనసభ్యుడు వంగవీటి రాధాకృష్ణ మంగళవారం సాయంత్రం మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తో సమావేశమయ్యారు. వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని వంగవీటి రాధా అన్నారు. జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన రాధా టీడీపీలో చేరతారని భావిస్తున్నారు. ఈ విషయంపై ఆయన తన అనుచరులు, సన్నిహితులతో చర్చలు జరుపుతున్నారు.
తనను, తన తండ్రి వంగవీటి రంగాను అవమానించేలా జగన్ వ్యవహరించారని రాధా ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆ పార్టీ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించారని, అయితే రాజకీయంగా కీలక నిర్ణయం కావడంతో అనుచరులు, సన్నిహితులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటానని, ఆ తర్వాతనే ఓ నిర్ణయం తీసుకుంటానని, అందుకే వేచి చూస్తున్నానని రాధా వివరించారు.