డేటా చోరీ: ఎవరీ అశోక్, అసలు ఏం చేశాడు?

By telugu teamFirst Published Mar 6, 2019, 11:13 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్‌ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను సూత్రధారిగా భావిస్తున్నారు.ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ అయిన దాకవరపు అశోక్‌ ఉపయోగించిన ఐఫోన్‌ కేసులో కీలకంగా మారింది. 

హైదరాబాద్‌: డేటా చోరీ కేసులో సైబరాబాద్ పోలీసులు ఐటి గ్రిడ్ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ పై లుకవుట్ నోటీసులు జారీ చేశారు. అతన్ని పట్టుకోవడానికి అవసరమైన రంగం సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదానికి అతని ఐటి గ్రిడ్ సంస్థ వ్యవహారం కారణమైంది. ఇంతకీ అశోక్ ఎవరు, అతను చేసిన వ్యవహారం ఏమిటనేది ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్‌ ద్వారా జరిగిన డేటా చోరీ కేసులో అశోక్ ను సూత్రధారిగా భావిస్తున్నారు.ఐటీ గ్రిడ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ అయిన దాకవరపు అశోక్‌ ఉపయోగించిన ఐఫోన్‌ కేసులో కీలకంగా మారింది. ఈ సంస్థ నిర్వహించిన సేవా మిత్ర యాప్‌కు చెందిన ప్రాసెస్డ్‌ డేటా మొత్తం దాని క్లౌడ్‌ మేనేజ్‌మెంట్‌ ద్వారా భద్రపరిచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరోవైపు సైబరాబాద్‌ పోలీసు లు మంగళవారం కూడా హైదరాబాద్‌ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్స్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎథికల్‌ హ్యాకర్ల సాయంతో చేసిన ఈ తనిఖీల్లో అత్యంత కీలకమైన సమాచారం లభించినట్లు తెలుస్తోంది. తెలంగాణ పోలీసులకు చిక్కకుండా, దర్యాప్తునకు సహకరించకుండా అతను ఏపీలో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాకు చెందిన అశోక్‌ కర్ణాటకలోని దావణగెరెలో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. తొలినాళ్లలో టీడీపీ కార్యకర్తగా పనిచేసినట్లు తెలుస్తోంది. తద్వారా ఆ పార్టీకి చెందిన కొందరు కీలక వ్యక్తులతో అతనికి పరిచయాలు ఏర్పడ్డాయి. 

అశోక్‌ హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఐటీ గ్రిడ్స్‌ సంస్థను నిర్వహిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేందుకు వీలుగా డేటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కీలకమైన వ్యక్తులు అతనికి పంపించినట్లు అనుమానిస్తున్నారు.అతనితోపాటు మరో నలుగురితో ఏర్పాటైన అనధికారిక కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సేవామిత్ర యాప్‌కు రూపం ఇచ్చింది. 

ఆ తర్వాత 2017లో నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో యాప్‌ ట్రయల్‌ రన్‌ చేపట్టారు.  దానివల్లనే టీడీపి నంద్యాలలో టీడీపి గెలిచిందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

click me!