
వైసీపీ అధినేత జగన్ పై మంత్రి దేవినేని ఉమా మరోసారి మండిపడ్డారు. రాష్ట్రంలోని ఓట్లను వైసీపీ నేతలు అక్రమంగా తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంలో ప్రజలు వైసీపీ నేతలను నిలదీస్తున్నారని చెప్పారు.
బుధవారం విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో దేవినేని మీడియాతో మాట్లాడారు. ఓట్ల తొలగింపు విషయంలో జగన్ పై ఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసీఆర్, మోదీలతో జగన్ చేతులు కలిపి జగన్ అక్రమాలకు పాల్పడుతున్నాడన్నారు. సీఎం కుర్చీ కోసం జగన్ ఎన్ని అరాచకాలైన చేస్తాడని ఆయన అన్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. అందుకే కులాలు, మతాల పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని కుట్ర చేస్తున్నారని ఉమ దుయ్యబట్టారు.
‘‘అధికారమే పరమావధిగా జగన్ మాట్లాడుతున్నారు. ఫారం-7 తానే దరఖాస్తు చేయించానని జగన్ ఒప్పుకున్నారు. జగన్ ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో 24లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారు. ఏపీలో 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారు. నెల్లూరు సభలో జగన్ మాట్లాడిన భాష జుగుప్సాకరం. ఓ అజెండా లేకుండా దిక్కుతోచని స్థితిలో ఆయన మాట్లాడుతున్నారు’’ అని ఉమ ధ్వజమెత్తారు.