ఏపీలో డేటా లీకేజ్.. దేవినేని ఉమా ఘాటు వ్యాఖ్యలు

By ramya NFirst Published Mar 5, 2019, 10:26 AM IST
Highlights

ప్రస్తుతం ఏపీలోని పౌరుల డేటా లీకేజ్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఏపీలోని పౌరుల డేటా లీకేజ్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ డేటా విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కేసు నమోదు చేయడంపై ఏపీ ప్రభుత్వం  అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కాగా.. తాజాగా ఈ ఘటనపై మంత్రి దేవినేని ఉమా స్పందించారు.

ఏపీలో 58లక్షల ఓట్లు తొలగించాలని కుట్ర చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు. ఇదంతా జగన్, కేసీఆర్ ప్లానేనని ఆయన ఆరోపించారు. వైసీపీ పార్లమెంట్ అభ్యర్థుల్ని కూడా కేసీఆర్ ఫామ్ హౌజ్ లోనే నిర్ణయిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో కూడా 28లక్షల ఓట్లను టీఆర్ఎస్ తొలగించిందని దేవినేని అన్నారు. కేసీఆర్ చేసిన నిర్వాకానికి తర్వాత అధికారులు క్షమాపణలు చెప్పారన్నారు.

తన సామంతరాజు జగన్ ని అధికారంలోకి తీసుకురావడానికి కేసీఆర్ దళారీ పాత్ర పోషిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ది డిలీషన్ టెక్నాలజీ అని అన్నారు. ఈ ఓట్ల తొలగింపు వివాదాన్ని ఇంతటితో వదలనని.. జాతీయ స్థాయిలో చర్చ లేవనెత్తుతామని దేవినేని సవాల్ చేశారు. ఏపీలోని 13 జిల్లాల్లో ఈ విషయంపై ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.

కేసీఆర్‌ నాయకత్వంలో జగన్‌, బీజేపీ నేతలు పని చేస్తున్నారని విమర్శించారు. 2014లో జగన్‌ గెలుస్తారని కేసీఆర్‌ చిలక జోస్యం చెప్పారన్నారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో కూర్చొని వైసీపీ అభ్యర్థుల జాబితా తయారు చేస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డికి ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంట అని ఎద్దేవా చేశారు. ఆంధ్రా పోలీసులు హైదరాబాద్‌ వెళ్తే కేసులు పెడతారని విమర్శించారు.

 ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో తమకూ అధికారం ఉందన్నారు. ఆంధ్రా పోలీసులపై తప్పుడు కేసులు నమోదు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. మోడీతో కుమ్మక్కై కేసీఆర్‌, జగన్‌ ఆడుతున్న ఆటకాలను ప్రజలు గమనిస్తున్నార్నారు. ఫారం-7 ద్వారా తప్పుడు పత్రాలు సమర్పించి టీడీపీ ఓట్లు తొలగించాలని చూస్తున్నారన్నారు.

click me!