అంచనాకు మించి వెంకన్నను దర్శించుకున్న భక్తులు...: వైవి సుబ్బారెడ్డి

By Arun Kumar PFirst Published Jun 8, 2020, 8:25 PM IST
Highlights

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అమలుపరుస్తూ గంటకు ఎంత మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం చేయించవచ్చో క్షేత్ర స్థాయిలో  అవగాహనకు రావడానికే ట్రయల్ రన్ ప్రారంభించామని టీటీడీ పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. 

తిరుపతి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను అమలుపరుస్తూ గంటకు ఎంత మంది భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనం చేయించవచ్చో క్షేత్ర స్థాయిలో  అవగాహనకు రావడానికే ట్రయల్ రన్ ప్రారంభించామని టీటీడీ పాలకమండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి చెప్పారు. సోమవారం ఉదయం శ్రీవారి ఆలయంలో ఉద్యోగులతో నిర్వహించిన ట్రయల్ రన్ ను ఆయన దగ్గరుండి పరిశీలించారు. క్యూలో భౌతిక దూరం అమలవుతున్న విధానాన్ని చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. 

కానుకలు సమర్పించేందుకు భక్తులు హుండి వద్దకు వెళ్ళేప్పుడు, బయటకు వచ్చేప్పుడు నాన్ ఆల్కహాల్ సానిటైజర్ తో చేతులు శుభ్రం చేస్తున్న విధానాన్ని పరిశీలించారు.  అనంతరం ఆలయం వెలుపల చైర్మన్ తనను కలసిన మీడియాతో మాట్లాడారు. 

మొదట గంటకు 500 మందికి దర్శనం చేయించవచ్చని అధికారులు అంచనా వేశారని చెప్పారు. అయితే దర్శనం ప్రారంభించిన 2 గంటల్లో 1200 మంది భౌతిక దూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారని చెప్పారు. మూడు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించి అవకాశాన్ని బట్టి రోజువారీ దర్శనాల సంఖ్య పెంచుతామని ఆయన తెలిపారు. 

read more  తిరుపతి, శ్రీశైలం.. ఆలయాల్లో ప్రారంభమైన ట్రయల్ రన్స్...

క్యూలైన్ లో భక్తులు గ్రిల్స్, గోడలు తాకకుండా వారికి అవగాహన కల్పిస్తామని, ఆలయం ప్రాంగణంలోని తాగునీటి కుళాయిలను కూడా చేత్తో తాకకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదం పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం లేఖ రాశామని... అనుమతి వచ్చిన వెంటనే ప్రసాదాల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. 

భక్తులకు అతిదగ్గరగా విధులు నిర్వహించే సిబ్బందికి పీపీఈ కిట్లు అందించామన్నారు. లడ్డు కౌంటర్లలో  2 గంటలు సగం కౌంటర్లు, ఆ తర్వాత సగం కౌంటర్లు పనిచేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయం, క్యూ కాంప్లెక్స్ తో పాటు లడ్డూ కౌంటర్ల ను కూడా ప్రతి 2 గంటలకు సానిటైజ్ చేయించాలని ఆదేశాలు జారీ చేసినట్లు  సుబ్బారెడ్డి వెల్లడించారు. 

 వేంకటేశ్వర స్వామి వారి దయతో త్వరగా కరోనా తొలగిపోయి ప్రపంచ ప్రజలందరూ ఆరోగ్యాంగా ఉండాలని ఆయన కోరారు. అలిపిరి వద్ద భక్తులను స్క్రీనింగ్ చేసి, సానిటైజ్ చేశాకే తిరుమలకు అనుమతిస్తున్నామని చైర్మన్ వివరించారు.

 

click me!