నేడు డిల్లీకి వైఎస్ షర్మిల ... కాంగ్రెస్ లో చేరడానికేనా?

By Arun Kumar PFirst Published Dec 28, 2023, 7:28 AM IST
Highlights

వైఎస్సార్ టిపి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి వైఎస్ షర్మిల సిద్దమయినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికకు ముందు జరగాల్సిన ఈ ప్రక్రియ ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందు ఖచ్చితంగా జరగనుందట. 

అమరావతి : ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వైఎస్ షర్మిల పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ టిపి ని పోటీలో నిలపకుండా కాంగ్రెస్ కు బయటనుండే షర్మిల మద్దతిచ్చిన విషయం తెలిసిందే. అయితే త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆమె బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతి త్వరలో షర్మిల హస్తం గూటికి చేరనున్నట్లు అటు వైఎస్సార్ టిపి, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 

వైఎస్సార్ టిపి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి వైఎస్ షర్మిల సిద్దమయినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అదిష్టానం కూడా ఇప్పటికే ఇందుకు అంగీకారం తెలిపినట్లు... అతి త్వరలో షర్మిలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ (డిసెంబర్ 28) కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూడిల్లీకి షర్మిల వెళుతున్నారు. 

Latest Videos

 షర్మిల డిల్లీ పర్యటనను తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులే కాదు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈరోజే షర్మిల కాంగ్రెస్ లో చేరనున్నారని... అందుకోసమే డిల్లీ వెళుతున్నారని ప్రచారం జోరందుకోవడంతో ఆమె డిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ డిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ పెద్దలతో షర్మిల చేరికపై చర్చించేందుకు ఆయన ముందుగా దేశ రాజధానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. 

Also Read  ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం: వై.ఎస్. షర్మిలతో కాంగ్రెస్ స్కెచ్ మామూలుగా లేదుగా...

షర్మిలను కాంగ్రెస్ లో చేర్చుకుని జాతీయస్థాయిలో ఏఐసిసి లో సర్దుబాట చేసే ఆలోచనలో కాంగ్రెస్ అదిష్టానం వున్నట్లు తెలుస్తోంది. అలాగే ఉత్తరాది రాష్ట్రాల ఇంచార్జీగా షర్మిలను నియమించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా షర్మిలను పార్టీలో చేర్చుకోవడమే కాదు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ అదిష్టానం సిద్దంగా వున్నట్లు వైఎస్సార్ టిపి వర్గీయులు చెబుతున్నారు. 

త్వరలో జరగనున్న ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసిపితో ఒంటరిగా, ప్రతిపక్ష టిడిపి, జనసేన కలిసి పోటీచేయడానికి సిద్దమవుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే వామపక్షాలతో కలిసి బరిలోకి దిగడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే జాతీయస్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎం  పార్టీలు వున్నాయి. ఇలా వామపక్షాలతో పాటు వైఎస్ షర్మిలను సమర్దవంతంగా వినియోగించుకుని ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి, టిడిపి-జనసేన కూటమికి గట్టిపోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. 

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసిపికి ఎక్కువ నష్టం చేయనుంది. వైసిపి అధినేత వైఎస్ జగన్ సొంత తల్లి విజయమ్మ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవి నుండి వైదొలగడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పుడు సొంత చెల్లి షర్మిల ఏకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి వైసిపి కి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్దమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారనుంది. ఏదేమైనా షర్మిల కాంగ్రెస్ లో చేరడానికి సిద్దమయ్యారన్న ప్రచారం వైసిపిలో గుబులు పుట్టిస్తూ వుండవచ్చు. 

click me!