నా తల తెస్తే రూ.కోటి ఇస్తానని లైవ్‌లో ఆఫర్ .. ఆ ముగ్గురిపై చర్యలు తీసుకోండి : ఏపీ డీజీపీకి ఆర్జీవీ ఫిర్యాదు

By Siva KodatiFirst Published Dec 27, 2023, 7:33 PM IST
Highlights

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డిని కలిశారు. అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావుపై ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. అలాగే టీవీ 5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు, ఛానెల్ ఓనర్ బీఆర్ నాయుడు మీద ఫిర్యాదు చేశారు.

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బుధవారం ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డిని కలిశారు. అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావుపై ఆర్జీవీ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రామ్ గోపాల్ వర్మ తలను నరికి తెచ్చిన వారికి రూ.కోటి నజరానా ఇస్తానంటూ ఆయన ప్రకటించారు. ఓ వార్తా సంస్థ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో కొలికపూడి శ్రీనివాసరావు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆర్జీవీ సీరియస్ అయ్యారు. ఏపీ పోలీసులకు విన్నపం.. నన్ను చంపేందుకు రూ.కోటి ఆఫర్ ప్రకటించిన  కొలికపూడి శ్రీనివాసరావు, ఆయనను రెచ్చగొట్టిన యాంకర్‌ సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ 5 ఛానెల్ యాంకర్ సాంబశివరావు, ఛానెల్ ఓనర్ బీఆర్ నాయుడు మీద ఫిర్యాదు చేశారు. నా తల తెస్తే కోటి ఇస్తానని లైవ్‌లో చెప్పడంతో పాటు నన్ను ఇంటికొచ్చి తగలబెడతానని పబ్లిక్‌గా చెప్పాడని వర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డిబేట్ సందర్భంగా శ్రీనివాసరావును వారిస్తున్నట్లుగా నటిస్తూ ఆ మాటను రిపీట్ చేయించారని, దీనిని బట్టి వారిద్దరూ నన్ను చంపేందుకు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్లు క్లియర్‌గా అర్ధమవుతోందని ఆర్జీవీ పేర్కొన్నారు. సదరు ఛానెల్‌లో ఈ తరహా డిబేట్ నిర్వహించిన యజమాని బీఆర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలని ఆయన డీజీపీని కోరారు. 

Latest Videos

కాగా.. రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘వ్యూహం’’ సినిమా వివాదాల్లో నలుగుతూనే వుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆర్జీవీ ఈ మూవీని రూపొందించారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఈ నెల 26న విచారించింది. రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని.. తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారని లోకేష్ తన పిటిషన్‌లో తెలిపారు.

వ్యూహం సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని..  ట్రైలర్ మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును అప్రతిష్ట పాల్జేసేందుకే సినిమా తీశారని.. వ్యూహం సినిమాతో జగన్‌కు లబ్ధి కలిగేలా చూస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యం పేరిట ఇష్టారీతిన సినిమా తీశారని.. దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని లోకేష్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు.

వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందని.. ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారని లోకేష్ తెలిపారు. లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారని, నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారని ఆయన ఆరోపించారు. జగన్ వెనుక ఉండి వ్యూహం సినిమా తీయించారని లోకేష్ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. 
 

click me!