
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని జనసేనఅధినేత పవన్ కల్యాణ్ గురువారం ప్రకటించారు. రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పవన్ కల్యాణ్, టీడీపీ నేతలు లోకేష్, బాలకృష్ణలు ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ మాట్లాడుతూ.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నట్టుగా పవన్ పేర్కొన్నారు. అయితే పొత్తులపై ప్రకటన వెలువడగానే.. పవన్ టార్గెట్‌గా వైసీపీ విమర్శల దాడికి దిగింది.
ప్యాకేజ్ బంధం బయటపడిందని వైసీపీ విమర్శించింది. పవన్ రాజమండ్రి జైలుకు వెళ్లిందే పొత్తును ఖాయం చేసుకునేందుకని ప్రజలకు పూర్తిగా అర్థం అయిందని పేర్కొంది. ‘‘ఇన్నాళ్ళూ నీమీద నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, కాస్తో కూస్తో నిన్ను నమ్మిన వాళ్ళకు ఈరోజుతో భ్రమలు తొలగించేశావు. ఇక ఇది పొత్తులకి, ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం. ఇక మిమ్మల్ని మూకుమ్మడిగా ఈ రాష్ట్రం నుంచి తరిమికొట్టడానికి ప్రజలంతా సిద్ధం’’ వైసీపీ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
Also Read: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి.. పవన్ ప్రకటన
పొత్తులపై పవన్ కల్యాణ్ ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాను అంటే.. నమ్మే పిచ్చోళ్ళు ఎవరూ లేరని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు హయాంలో వంగవీటి రంగాను నడిరోడ్డుపై చంపినప్పుడు.. ముద్రగడ పద్మనాభంను అరెస్ట్ చేసినప్పుడు ఈ రాష్ట్రంలో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అదే చంద్రబాబుకు పవన్ మద్దతిస్తూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ పొగుడుతుంటే మాకు సిగ్గుగా ఉంది’’ అని పేర్కొన్నారు.
Also Read: ములాఖత్‌లో చంద్రబాబుతో మాట్లాడింది ఇదే.. : పవన్ కల్యాణ్, వైసీపీపై సెటైర్లు