ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ తొలిసారిగా పాజిటివ్‌గా స్పందించింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ ప్రమాద బాధితులకు సహాయం ప్రకటించింది.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా జరిగిన ప్రమాద ఘటనపై వైసీపీ స్పందించింది. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి జగన్ పార్టీ పాజిటివ్‌గా రెస్పాండ్ అయింది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా ఫార్మాలో బ్లాస్ట్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా అండగా నిలుస్తుందని మాజీ మంత్రి, శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాకు రూ.5 లక్షల చొప్పున, గాయపడి, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరికీ లక్ష రూపాయల చొప్పున తమ పార్టీ నుంచి సహాయం చేస్తామని వెల్లడించారు. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు స్వయంగా ఆ సహాయాన్ని బాధితులకు అందజేస్తారని తెలిపారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్దేశించారని బొత్స చెప్పారు.
undefined
విశాఖపట్నం క్యాంప్ ఆఫీస్‌లో శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. బ్లాస్ట్ ఘటన తర్వాత సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మంత్రులెవరూ సక్రమంగా స్పందించలేదని ఆక్షేపించారు. పరిశ్రమల్లో రక్షణ చర్యల్లోనూ అంతులేని నిర్లక్ష్యం చూపుతున్నారని.. ఎంతసేపూ గత తమ ప్రభుత్వంపై నిందలు మోపడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని తప్పుపట్టారు.
బాధ్యత మర్చిన ప్రభుత్వం...
ఎక్కడైనా ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు, అక్కడికి వచ్చే ప్రభుత్వ పెద్దలు, వెంటనే ఏమేం చేశారు? బాధితులను ఎలా ఆదుకున్నారు? భవిష్యత్తులో మళ్లీ జరగకుండా ఏ జాగ్రత్తలు తీసుకుంటారో చెబుతారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. కానీ, ఇక్కడికి వచ్చిన ప్రభుత్వ పెద్దలు, అసలు విషయాన్ని పక్కనపెట్టి ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంలో ఉన్న వారు బాధ్యతతో మాట్లాడాలని స్పష్టం చేశారు. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాదం జరిగితే.. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను మర్నాడు విశాఖకు తీసుకొచ్చారన్నారు. ఘటన తర్వాత, కనీసం కార్మికుల కుటుంబాలకు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చాలా మంది తాము టీవీలో చూసి వచ్చామని బాధితుల కుటుంబాల వారు చెప్పారని తెలిపారు.
ఆనాడు మా స్పందన ఇదీ..
తమ ప్రభుత్వ హయాంలో ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీ ప్రమాదం జరిగితే, తామెంత వేగంగా స్పందించామన్నది అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ‘మా హయాంలో ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన తెల్లవారుజామున జరిగితే, ఉదయానికల్లా పలువురు మంత్రులు అంతా, నాతో సహా తరలి వచ్చాం. మధ్యాహ్నానికల్లా స్వయంగా సీఎంగారు కూడా వచ్చారు. ఇది వాస్తవం కాదా? పైగా అప్పుడు కరోనా విజృంభిస్తోంది. అయినా,మేమెవ్వరం వెనక్కు తగ్గలేదు. ఎందుకంటే అది మా బాధ్యతగా భావించాం’ అని బొత్స స్పష్టం చేశారు.
అదే, ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ, తమపై నిందలు వేస్తున్నారన్నారు. ఇప్పుడు ఈ ప్రమాదాలకు కారణం తామేనని ఆరోపిస్తున్నారని ఆక్షేపించారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న బొత్స... ఇప్పుడు సీఎస్‌గా ఉన్న అధికారి నేతృత్వంలో ఆరోజు కమిటీ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో భద్రత గురించి నివేదిక తీసుకున్నామని, ఆ మేరకు పరిశ్రమల్లో సెక్యూరిటీ ప్రొటోకాల్ రూపొందించి, జీఓ కూడా ఇచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా తాము బాధ్యతాయుతంగా వ్యవహరించామన్న బొత్స.. ప్రమాదం విషయం తెలియగానే, పార్టీ నేతలంతా తరలి వచ్చామన్నారు. చివరకు మార్చురీ వద్దకు కూడా పోయామని, అక్కడ మృతుల కుటుంబాల వారిని కలుసుకున్నామని చెప్పారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఒక్క పని కూడా చేయలేదన్నారు. కనీసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు.
నాడెలా స్పందించామో అందరికీ తెలుసు...
తమ హయాంలో ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీక్ అయితే, తాము ఎంత వేగంగా స్పందించామో అందరికీ తెలుసని బొత్స గుర్తుచేశారు. ఎన్నడూ లేని విధంగా కోటి రూపాయల చొప్పున పరిహారం ఇచ్చామని తెలిపారు. వెంటనే రూ.30 కోట్లు ప్రభుత్వం నుంచి ఇచ్చి, ఆ తర్వాత కంపెనీ నుంచి రీయింబర్స్ చేశామని వివరించారు. అదే ఇక్కడ, ఫ్యాక్టరీ యాజమాన్యం కనిపించడం లేదని అంటున్నారని, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? అని ప్రశ్నించారు. వారు ఎక్కడున్నా తీసుకురావాలని, పరిహారం వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ దిశగా పని చేస్తున్నట్లు కనిపించలేదు కాబట్టే.. బాధితులను వెంటనే ఆదుకోకపోతే ధర్నా చేస్తామని, తాను కూడా వచ్చి కూర్చుంటానని జగన్‌గారు ప్రకటించారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.