ఆంధ్ర ప్రదేశ్ కు మరిన్ని నిధులు అందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిధులు కూడా పవన్ కల్యాణ్ మంత్రిగా వ్యవహరిస్తున్న శాఖలకే కేటాయించింది కేంద్రం.
Pawan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వ నిధుల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో అమరావతి నిర్మాణానికి భారీ నిధులు కేటాయించింది... పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇచ్చింది కేంద్రం. ఇక రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి ఆర్థిక పరంగానే కాదు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తోంది మోదీ సర్కార్. ముఖ్యంగా పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు కేంద్రం నుండి భారీగా నిధులు వస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి మరిన్ని నిధులు విడుదలయ్యాయి... ఆ వివరాలను స్వయంగా పవన్ కల్యాణ్ తెలియజేసారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని పలు నగరాలు, పట్టణాల సుందరీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో భారీగా చెట్లను పెంచి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు నగర వనాల అభివృద్ది చేపట్టింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరగా తాజాగా నిధుల మంజూరుకు ఆమోదం లభించిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
undefined
రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగరవనాలను అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు.ఇందుకోసం తొలి విడతగా రూ.15.4 కోట్ల నిధులను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో కర్నూల్, కడప, నెల్లిమర్ల, చిత్తూరులో రెండు, శ్రీకాళహస్తి, తాడేపల్లిగూడెం, పెనుకొండ, కదిరి, పలాస, విశాఖపట్నంలలో నగర వనాలను అభివృద్ధి చేయనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
ఇక ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50 నగర వనాల అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని... రాబోయే వంద రోజుల్లో 30 నగరవనాల పనులు పూర్తిచేయడమే టార్గెట్ గా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు పవన్ కల్యాణ్. కేంద్రం నుంచి వస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే అవకాశం లభించాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో పచ్చదనం 50శాతం మేరకు ఉండాలని.. ఇందులో భాగంగా నగర వనాలు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు.
ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ... ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక వేడుకలా చేయాలని... ప్రభుత్వ శాఖలతోపాటు అన్ని విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, పరిశ్రమలు, అధ్యాత్మిక సంస్థలను ఇందులో పాలుపంచుకొనేలా చూడాలని అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.