ఏపీలో రాజకీయ సునామీ... అందులో వైసిపి కొట్టుకుపోవడం ఖాయం : అమరావతిలో కోటంరెడ్డి సంచలనం

By Arun Kumar PFirst Published Mar 31, 2023, 1:05 PM IST
Highlights

వైఎస్సార్ తెలంగాణ పార్టీ నుండి ఇటీవలే సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు తెలియజేసారు.  

అమరావతి : వైసిపి రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు ఉద్యమం 1200 రోజులకు చేరింది. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమంలో స్వయంగా పాల్గొని సంఘీభావం తెలిపిన కోటంరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

రాజధాని పరిరక్షణ కోసం ఎండనకా,వాననకా... లాఠీలకు భయపడకుండా గత 1200 రోజులుగా ఉద్యమిస్తున్న ప్రతి ఒక్కరికీ సంఘీభావం తెలియజేస్తున్నానని కోటంరెడ్డి అన్నారు. శ్రీరాముడు రాజధాని అయోధ్య, శ్రీకృష్ణుడి రాజధాని ద్వారక లాగే ఏపీ రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అమరావతి నిర్మాణం చేపట్టిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని కోటంరెడ్డి కొనియాడారు. 

Latest Videos

వీడియో

ఏపీ రాజధానిగా అమరావతి అందరికీ ఆమోదయోగ్యం కాబట్టే ఆనాడు ప్రతిపక్ష నేతగా వున్న జగన్ నిండు సభలో మద్దతిచ్చారని కోటంరెడ్డి గుర్తుచేసారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకున్నాం... తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి, మడమ తిప్పి మూడు రాజధానులు అంటున్నారని అన్నారు. ఎందుకు మాట తప్పారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని కోటంరెడ్డి డిమాండ్ చేసారు. 

Read More  ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు.. జగన్ ఢిల్లీ పర్యటనకు మూలం అదే.. రఘురామ

ఆనాడు అమరావతి నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి నీరు, మట్టి తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కోరారు. తెలుగు వారి పక్షాన రెండు చేతులు జోడించి ప్రధానిని వేడుకుంటున్నా... రాజధానిని అమరావతిలోనే కొనసాగేలా చూడాలని కోరారు. ప్రధాని మోదీ చెబితే అమరావతే రాజధానిగా కొనసాగుతుందని అన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వారి గుండె చప్పుడు రాజధాని అమరావతి అని అన్నారు. 

ఇక ఇంతకాలం తాను అమరావతి ఉద్యమానికి మద్దతు తెలపకపోవడంపై కోటంరెడ్డి స్పందించారు. వైసిపి ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి పార్టీ నిర్ణయానికి తల వంచక తప్పలేదు... వ్యతిరేకించాలంటే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి వుండేదన్నారు. కానీ ఇప్పుడు వైసిపి నుండి బయటకు వచ్చాను కాబట్టి ధైర్యంగా అమరావతికి మద్దతు ఇవ్వగలుగుతున్నానని అన్నారు. ఆరోజు ఈరోజే కాదు ఏరోజైనా అమరావతే రాజధానిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని కోటంరెడ్డి స్పష్టం చేసారు. 

వచ్చే ఎన్నికల్లో రాజకీయ సునామీ రాబోతోందని కోటంరెడ్డి అన్నారు. ఏపీ రాజధానిని మూడు ముక్కలు చెయ్యాలి అనుకున్న రాజకీయ పార్టీలన్ని ఈ ఎన్నికల సునామీలో కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. అమరావతి ఉద్యమం కొందరు రైతులదో, కొన్ని గ్రామాల సమస్యో కాదు... రాష్ట్రంలో ఉన్న కోట్లాది ప్రజల సమస్య అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేసారు. 
 

click me!