చంద్రబాబు గుర్తింపు మాకు అవసరం లేదు: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

By Nagaraju TFirst Published Dec 10, 2018, 10:16 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 11 నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అఖిలపక్ష సమాశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈనెల 11 నుంచి జరగబోయే పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అఖిలపక్ష సమాశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు మందు జరగబోతున్న ఈ శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అలాగే తిత్లీ బాధితులకు ప్రత్యేక సాయం అందించాలని కోరినట్లు చెప్పారు. 

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కేంద్ర సంస్థలతో దర్యాప్తు చేయించాలని కోరినా కేంద్ర ప్రభుత్వం స్పందిచకపోవడాన్ని ప్రశ్నించినట్లు తెలిపారు. తిత్లీ తుఫానులో నష్టపోయిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక సాయం చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. 

విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో ఇచ్చిన హామీలైనటువంటి చెన్నై, విశాఖ కారిడర్‌, దుగ్గరాజు పట్నం పోర్టు ఏర్పాటుతోపాటు పలు హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్‌ చెరలో ఉన్న 22 మంది జాలరులను విడిపించే ప్రయత్నం చేయాలని కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. 

రాష్ట్రంలోని 11 కరువు జిల్లాలలో కరవు విలయతాండవం చేస్తుందన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అలాగే నిధులు విడుదల చెయ్యాలంటూ కోరినట్లు తెలిపారు. రెండు వేరువేరు ప్రాంతాల్లో ఓటు వేయడాన్ని నేరంగా పరిగణించేలా చర్యలు తీసుకోవాలని అవసరమైతే ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలని సూచించినట్లు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 

మరోవైపు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నా కేంద్రం చూస్తూ కూర్చుంటోందని ఆరోపించారు. సాగు భూములను సైతం సేకరించే విధంగా భూసేకరణ చట్టానికి ఏపీ ప్రభుత్వం సవరణలు తెచ్చింది దీనిపై కేం‍ద్రం ఎందుకు స్పందిచటం లేదని నిలదీసినట్లు తెలిపారు. 

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ వ్యవస్థను భ్రష్టుపట్టించేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నా ఆయన పై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఆడియో టేప్‌లో ఉన్నది చంద్రబాబు గొంతేనని కేంద్ర ప్రభుత్వ సంస్థ ధృవీకరించినా ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని కేంద్రాన్ని నిలదీశారు. 

విపక్షాల మీటింగ్‌లో పాల్గొనాల్సిందిగా తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదు. విపక్షంగా చంద్రబాబు ఇచ్చేగుర్తింపు తమకు అక్కర్లేదు. చంద్రబాబులా రంగులు మార్చే అవసరం వైసీపీకి లేదన్నారు. 

అధికారంలో నాలుగేళ్లు కొనసాగారు. ఇప్పుడు చంద్రబాబు రంగు మార్చి ప్రతిపక్షంలో ఉన్నానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తమ పార్టీది ఎప్పుడూ ప్రజల పక్షమేనని విజయసాయిరెడ్డి వివరించారు. 

click me!