వర్సిటీగా గీతం వద్దు... యూజీసీ, కేంద్రానికి విజయసాయి ఫిర్యాదు

By Siva KodatiFirst Published Oct 29, 2020, 5:29 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన విశాఖపట్నం గీతం యూనివర్సిటీ కూల్చివేతల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గీతం పై యూజీసీ ఛైర్మన్‌, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వేడెక్కించిన విశాఖపట్నం గీతం యూనివర్సిటీ కూల్చివేతల నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గీతం పై యూజీసీ ఛైర్మన్‌, కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్‌కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాశారు.

గీతం వర్సిటీ అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆ లేఖలో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2007 సంవత్సరంలో డీమ్డ్‌ వర్శిటీ ప్రారంభించేందుకు గీతం యాజమాన్యం యూజీసీ అనుమతి తీసుకుందన్నారు.

2008లో హైదరాబాద్‌, 2012లో బెంగళూరు ఆఫ్‌ క్యాంపస్‌ సెంటర్లు ప్రారంభించిందని విజయసాయి చెప్పారు. విశాఖ క్యాంపస్‌ కోసం ప్రభుత్వ భూమిని గీతం కబ్జా చేసినట్లు తన దృష్టికొచ్చిందని సాయిరెడ్డి పేర్కొన్నారు.

క్యాంపస్‌ కోసం నిబంధనలు ఉల్లంఘించి భూములు సేకరించారని ఆయన ఆ ఫిర్యాదు లేఖలో ఆరోపించారు. నిబంధనల ఉల్లంఘన, డాక్యుమెంట్లు బహిర్గతం చేయకపోవడంపై విజయసాయిరెడ్డి అభ్యంతరం తెలిపారు. జీసీ చట్టంలోని పలు నిబంధనలను గీతం ఉల్లంఘించిందని, దూరవిద్యతో పాటు పలు యూజీసీ నిబంధనలు పాటించడం లేదని ఆయన ఆరోపించారు.

నిబంధనలు ఉల్లంఘిస్తున్న గీతం గుర్తింపు రద్దు చేయాలని యూజీసీని విజయసాయిరెడ్డి కోరారు. అలాగే, విద్యార్థులు నష్టపోకుండా గీతంను ఆంధ్రా యూనివర్సిటీ అఫ్లియేషన్ పొందేలా చూడాలని ఆయన యూజీసీ ఛైర్మన్, కేంద్ర విద్యా మంత్రులకు  విజ్ఞప్తి చేశారు. 

Also Read:గీతం భూములపై సీబీఐ విచారణ: ఏపీ ప్రజా సంఘాల జేఏసీ డిమాండ్

ఇటీవల విశాఖ గీతం యూనివర్సిటీలోని కొన్ని కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ప్రభుత్వ భూములు అక్రమించి ఈ నిర్మాణాలు చేపట్టారని ఆరోపిస్తూ అధికారులు కూల్చివేశారు.

అయితే నోటీసులు ఇవ్వకుండానే అధికారులు నిర్మాణాలను కూల్చివేస్తున్నారని గీతం యూనివర్సిటీ యాజమాన్యం ఆరోపిస్తుంది. ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా చేయడం సరైనది కాదని పేర్కొంది.

ఇందుకు సంబంధించి న్యాయపరమైన అంశాలు కోర్టులో ఉన్నాయని తెలిపింది. అయితే రిషికొండ, ఎండాడ పరిధిలో 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం యూనివర్సిటీ అక్రమించినట్టుగా విచారణలో తేలిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ విధానం మేరకు అక్రమణల తొలగింపు చేపట్టినట్టు చెప్పారు. అక్రమణలో ఉన్న మరికొన్ని కట్టడాలను గుర్తించామని.. తదుపరి దశలో వాటిని కూల్చివేస్తామని చెప్పారు. అక్రమణల కూల్చివేతపై యజమాన్యానికి పూర్తి సమాచారం ఉందన్నారు. 

click me!