
వైఎస్ షర్మిల కొత్త పార్టీపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. షర్మిల పార్టీ పెట్టడం జగనన్న డైరెక్షన్‌లో జరిగిందా.. లేదా అనేది త్వరలో తేలుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకమని, ఆయన సమైక్య వాది అన్న విషయం తెలంగాణలో అందరికీ తెలుసంటూ రఘరామ అన్నారు. వైఎస్ పేరు లేకుండా షర్మిల లేదన్నారు.
షర్మిల పార్టీకి తెలంగాణలో ఓట్లు రావడం కష్టమని ఆయన జోస్యం చెప్పారు. దానికంటే తమిళనాడు లేదా కర్నాటకలో పార్టీ పెడితే ఎక్కువ ఓట్లు వస్తాయని నర్సాపురం ఎంపీ సూచించారు.
Also Read:జగన్, వైఎస్ షర్మిల మధ్య విభేదాలు: తేల్చేసిన సజ్జల రామకృష్ణా రెడ్డి
వైఎస్ జగన్‌కు సంబంధం లేకుండా షర్మిల తీసుకున్న నిర్ణయమని, అన్నకు ఇబ్బంది లేకుండా షర్మిల సొంతంగా తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యానించారు. జగన్ జైళ్లో ఉన్నప్పుడు పార్టీ కోసం షర్మిల చాలా కష్టపడ్డారని రఘురామకృష్ణ రాజు చెప్పారు.
అన్నాచెల్లెళ్ల మధ్య అద్భుతమైన అనుబంధం ఉందని.. రక్తసంబంధం సినిమాలో రామారావు-సావిత్రి కంటే కూడా ఎక్కువ అనుబంధం వారి మధ్య ఉందని రఘరామ చెప్పారు. ఈ విషయంలో తమకు అనుమానం లేదన్నారు.
నిజంగా ఇద్దరి మధ్యా వైరం ఉంటే, ఏపీలో పెట్టకుండా.. తెలంగాణలో ఎందుకు పార్టీ పెడతారని ఆయన ప్రశ్నించారు. బ్రదర్ అనిల్ విల్లు అయితే.. షర్మిల బాణం అవుతుంది... ఇక్కడ పోరాడతారని అని రఘురామకృష్ణంరాజు చెప్పారు.