30 లక్షల టిడ్కో ఇళ్లు ఖాళీగానే.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ వద్దు , కేంద్రానికి రఘురామ లేఖ

Siva Kodati |  
Published : May 20, 2023, 07:50 PM ISTUpdated : May 20, 2023, 07:53 PM IST
30 లక్షల టిడ్కో ఇళ్లు ఖాళీగానే.. ఆర్ 5 జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ వద్దు , కేంద్రానికి రఘురామ లేఖ

సారాంశం

ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని కేంద్రాన్ని కోరారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈ మేరకు శనివారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు.

ఏపీ రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాజధాని రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వానికే మద్ధతు పలికింది. దీంతో ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పందించారు. ఈ మేరకు శనివారం కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి లేఖ రాశారు. అమరావతిలో ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం కింద ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే అంశం సుప్రీంకోర్టు వద్ద పెండింగ్‌లో వుందని రఘురామ అందులో తెలిపారు. 

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ పథకం కింద పేదలకు స్థలాలను పంపిణీ చేయడం సరికాదన్నారు. దీనిలో భాగంగా ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ స్కీం కింద రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసిన నిధులను నిలుపుదల చేయాలని రఘురామ కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యమంత్రి జగన్‌కు అమరావతి అంటే ద్వేషమని.. అందుకే విశాఖ నుంచే పరిపాలన చేస్తామని ప్రకటిస్తున్నారని రఘురామ ఫైర్ అయ్యారు. ఉద్దేశ్యపూర్వకంగానే ముఖ్యమంత్రి ఈ తరహా చర్యలకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే నిర్మాణమై సిద్ధంగా వున్న 30 లక్షల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. 

కాగా.. అమరాతి రాజధాని ప్రాంతంలో ఆర్‌-5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను అమరావతి రైతులు సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. వాస్తవానికి ఎలక్ట్రానిక్ సిటీ కోసం ఉద్దేశించిన ఆర్-5 జోన్‌లో గృహ స్థలాలను ఈడబ్ల్యూఎస్ సమూహాలకు కేటాయించాలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోదని తెలిపింది. పట్టాలు పంపిణీ చేస్తే కనక హైకోర్టులో పెండింగ్ రిట్ పిటిషన్‌పై తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండదని పేర్కొంది. 

Also REad: ఆర్ 5 జోన్ వివాదం.. కోర్టుకు వెళ్లింది రియల్టర్లు, బ్రోకర్లే .. వాళ్లందరికీ బాస్ చంద్రబాబే : సజ్జల వ్యాఖ్యలు

ఇక, విచారణ సందర్భంగా.. రైతుల తరపున న్యాయవాదనలు, ప్రభుత్వం తరపున న్యాయవాదులు సుప్రీం కోర్టులో సుదీర్ఘ వాదనలు వినిపించారు. రైతుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రం, దేశ ప్రయోజనాలు కోసం రైతులు భూమిలిచ్చారని చెప్పారు. అమరావతిలో మహా నగరం వస్తుందని హామీ ఇచ్చారని.. ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు వస్తాయని ఆశ చూపారని తెలిపారు. ఆ మాటలు నమ్మి ఎలాంటి పరిహారం తీసుకోకుండా భూములిచ్చారని చెప్పారు.  

ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మనుసింఘ్వీ.. 2003 మార్చి 21న ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ నోటిఫికేషన్ ఇచ్చిందని తెలిపారు. 34 వేల ఎకరాల్లో 900 ఎకరాలే ఈడబ్ల్యూఎస్‌కు ఇచ్చారని చెప్పారు. 3.1 శాతమే ఈడబ్ల్యూఎస్‌కు ఇచ్చారని తెలిపారు. ఇక్కడున్న కేసులన్నీ వ్యక్తిగతంగా వేసినవేనని చెప్పారు. ఫ్లాట్ల అలాట్‌మెంట్ పూర్తైందని తెలిపారు. లబ్దిదారుల జాబితా ప్రభుత్వం వద్ద సిద్దంగా  ఉందని  చెప్పారు. జాబితా విషయాన్ని లబ్దిదారులకు ఇంకా చెప్పలేదని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu