
విజయవాడ కృష్ణలంక పీఎస్‌లో (krishnalanka police station) ఎంపీ నందిగం సురేష్ (nandigam suresh) హల్‌చల్ ఎపిసోడ్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. స్టేషన్ బయట, లోపల ఎంపీ సురేష్ అనుచరులపై ఇన్‌స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. ఎంపీ నందిగం సురేష్ అనుచరులపై దుర్భాషలాడుతూ ఇన్‌స్పెక్టర్ చేయి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు వెలుగులోకి వీడియోలు వచ్చాయి. ఎంపీ సురేష్ అనుచరులపై ఇన్‌స్పెక్టరే చేయి చేసుకున్నట్లు వీడియోలలో వుందని అంటున్నారు. తమపై చేయి చేసుకోవటం వల్లే.. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చామంటున్నారు బాధితులు. ఇన్‌స్పెక్టర్ మమ్మల్ని కారణం లేకుండా కొట్టారని.. నందిగం సురేష్ అనుచరులు ఆరోపిస్తున్నారు.
కాగా.. మంగళవారం విజయవాడ గంగోత్రి హెటల్ సమీపంలో ఎస్‌ఐ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్ చేస్తున్న వారితో పాటు దొంగతనాల తనిఖీ కోసం ఈ డ్రైవ్ నిర్వహించారు. అదే సమయంలో కొందరు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ కనిపించారు. ఓల్డ్ పీసీఆర్ జంక్షన్ నుంచి బైక్‌పై ముగ్గురు యువకులు ర్యాష్ డ్రైవింగ్ చేశారు. వారిని ఎస్‌ఐ అడ్డుకుని.. అదుపులోకి తీసుకున్నారు. అక్కడికక్కడే కేసు నమోదు చేసి కృష్ణలంక పీఎస్‌కు తరలించారు. ఐతే వారు పోలీస్ స్టేషన్‌లో నానా హంగామా చేశారు. తాము ఎంపీ నందిగం సురేష్ అనుచరులమని.. మమ్మల్నే అరెస్ట్ చేస్తారా? అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అయినప్పటికీ పోలీసులు మాత్రం విడిచిపెట్టలేదు.
అప్పటికే ఈ సమాచారం ఎంపీ నందిగం సురేష్ దాకా వెళ్లింది. దీంతో ఆయన అప్పటికప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ ఎంపీ పీఎస్‌కు రావడంతో పోలీసులు షాకయ్యారు. అదుపులోకి తీసుకున్న వారంతా తన అనుచరులేనని, వారిని వదిలేయాలని పోలీసులకు సూచించారు ఎంపీ . మరోసారి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఐతే స్వయంగా ఎంపీనే తమ కోసం పోలీస్ స్టేషన్‌కు రావడంతో ఆయన అనుచరులు మరింత రెచ్చిపోయినట్లు సమాచారం. ఆయన ముందే పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసేందుకకు ఓ కానిస్టేబుల్ ప్రయత్నించగా.. ఎంపీ అనుచరుల్లో ఒకరు ఫోన్ లాగేసుకోవడంతో పాటు దాడికి దిగినట్లుగా తెలుస్తోంది.