వైసీపీ ఎమ్మెల్సీ కారులో మృతదేహం: సుబ్రహ్మణ్యం బంధువుల ఆందోళన.. పోస్టుమార్టమ్‌పై ఉత్కంఠ

By Sumanth KanukulaFirst Published May 21, 2022, 10:41 AM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్‌పై ఉత్కంఠ కొనసాగుతుంది. 

వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద మృతి నేపథ్యంలో కాకినాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్‌పై ఉత్కంఠ కొనసాగుతుంది. సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు, బంధువుల ఆందోళనతో అధికారులు పోస్టుమార్టమ్ నిలిచిపోయింది. ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ రప్పించాలని సుబ్రహ్మణ్యం బంధువులు ఆందోళ నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చాకే పోస్టుమార్టమ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మరోవైపు సుబ్రహ్మణ్యం మృతిపై ఎమ్మెల్సీ అనంతబాబు ఇంకా స్పందించలేదు. 

ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ వద్ద సుబ్రహ్మణ్యం ఐదేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు. మూడు నెలల క్రితం సుబ్రహ్మణ్యం.. ఎమ్మెల్సీ వద్ద డ్రైవర్‌గా మానేశాడు. అయితే శుక్రవారం తెల్లవారుజామున ఉదయభాస్కర్.. సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని కారులో నూకమమ్మ గుడి సమీపంలోని అతని తల్లిదండ్రుల అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి వదిలిపెట్టాడు. ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతిచెందాడని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో.. మృతదేహాం ఉన్న కారు అక్కడే వదిలేసి మరో వాహనంలో వెళ్లిపోయారు. అనంతరం సుబ్రహ్మణ్యం తల్లి వీధి రత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు ప్రకారం.. గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మణికంఠ అనే వ్యక్తితో సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఉదయభాస్కర్ తెల్లవారుజామున 1.30 గంటలకు సుబ్రహ్మణ్యం సోదరుడికి ఫోన్ చేశాడు. డ్రైవర్ ప్రమాదానికి గురైనందున అమృత ఆసుపత్రికి వెంటనే రావాలని కోరారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎమ్మెల్సీ మృతదేహాన్ని వారి అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లారు. సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారని కుటుంబ సభ్యులకు తెలిపారు.

సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ మీడియాతో మాట్లాడుతూ..తన భర్త శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆయనను హత్య చేశారని ఆరోపించారు. తన భర్త ఎలా మరణించాడో ఎమ్మెల్సీ వివరించలేదని చెప్పారు. ఇక, ఉద్యోగం మానేయడానికి ముందు తన కొడుకు ఎమ్మెల్సీ నుంచి రూ.30 వేలు అప్పుగా తీసుకున్నాడని సుబ్రహ్మణం తల్లి తెలిపారు. సుబ్రమణ్యం డబ్బులు తిరిగి చెల్లించలేకపోవడంతో తీవ్ర పరిణామాలుంటాయని ఎమ్మెల్సీ హెచ్చరించారని ఆమె ఆరోపించింది. సుబ్రమణ్యం రంపచోడవరం నివాసి ఉదయభాస్కర్‌తో తరచూ ప్రయాణాలకు వెళ్లేవాడని కుటుంబీకులు తెలిపారు.ఇక, సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు పరామర్శించారు. సుబ్రహ్మణ్యం మృతిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జీజీహెచ్‌లోని మార్చురీ వద్ద ధర్నాకు దిగారు.

click me!