వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల విచారణలో అనంతబాబు కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారని సమాచారం. కాకినాడ జిల్లా సాయుధ దళం క్వార్టర్స్‌లో పోలీసు ఉన్నతాధికారులు అనంతబాబును విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. హత్యకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. అయితే పోలీసులు విచారణలో అనంతబాబు నేరాన్ని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. తాను ఒక్కడినే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టుగా అనంతబాబు విచారణలో చెప్పినట్టుగా సమాచారం.
వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడనే సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్టుగా అనంతబాబు అంగీకరించారని తెలుస్తోంది. తాను ఒక్కడిని మాత్రమే హత్య చేశానని తెలిపినట్టుగా సమాచారం. మరోవైపు అనంతబాబు అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు నుంచి ఎలాంటి ధ్రువీకరణ రావడం లేదు. అయితే సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని కాకినాడ పోలీసులు చెబుతున్నారు. పోలీసుల మీడియా సమావేశం తర్వాత ఈ విషయంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇక, ఈ కేసుకు సంబంధించి స్థానిక పోలీసులు తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అనంతబాబు అధికార పార్టీ నేత కావడంతోనే సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యుల వాదనలను తొలుత పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. చివరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల నేపథ్యంలో తొలుత అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. తర్వాత హత్య కేసుగా మార్చారు.
పోస్టుమార్టమ్ ప్రాథమిక రిపోర్ట్‌లో ఏముందంటే..?
సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ ప్రాథమిక నివేదికలో అతడికి కొట్టి చంపినట్టుగా తేలిందని సమాచారం. మృతుడి బట్టలపై బీచ్‌లో మట్టి, ఇసుక.. ఒంటిపై కాళ్లతో తన్నిన గుర్తులు, సుబ్రహ్మణ్యం తల మీద ఎడమవైపు గాయం ఉన్నట్టుగా వైద్యులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఎడమ కాలు బొటన వేలుపై, కుడి కాలు మడెం దగ్గర, ఎడమ చేయి, పై పెదవిపై గాయాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించారని సమాచారం.
ఇక, సుబ్రహ్మణ్యం పోస్టుమార్టమ్ విషయంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగిన సంగతి తెలిసిందే.. చివరకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను సాయంత్రం పోలీసులు కాకినాడ జీజీహెచ్ మార్చురీ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం శవ పంచనామా నిర్వహించారు. అయినప్పటికీ పోస్టుమార్టమ్ అంగీకారపత్రంపై సంతకాలు చేసేందుకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఇక, ఈ కేసులో ఉదయభాస్కర్‌ను అరెస్ట్ చేస్తామని శనివారం రాత్రి ఎస్పీ ప్రకటించారు.
తొలుత మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేశామని ఎస్పీ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరించామని.. ఆ మేరకు సెక్షన్ 302 కిందకు మారుస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ కేసు కూడా పెడతామన్నారు. కేసు నమోదయ్యాక పోస్టుమార్టం చేసిన తర్వాతే.. దాని నివేదిక ప్రకారం కేసులో సెక్షన్లు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎస్పీ ప్రకటన తర్వాత సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిర్వహించేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించారు. పోస్టుమార్టమ్ అనంతరం సుబ్రహ్మణ్యం స్వగ్రామం పెదపూడి మండలం జి మామిడాడకు మృతదేహాన్ని తరలించారు. సుబ్రహ్మణ్యం మృతదేహానికి ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.