కేంద్ర హోం సెక్రటరీకి రాష్ట్ర ఎన్నికల సంఘం పేరుతో వెళ్లిన లేఖపై విచారణ జరపాల్సిందిగా వైసిపి ఎమ్మెల్యేలు డిజిపి గౌతమ్ సవాంగ్ ను కోరారు.
అమరావతి: స్థానికసంస్థల ఎన్నికల వాయిదాతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసిపికి మధ్య వివాదం మొదలయ్యింది. తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోద్బలంతోనే ఈసీ ఎన్నికలను వాయిదా వేశారంటూ వైసిపి నాయకులు మండిపడుతున్నారు. కొందరు వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో ఆయనను హెచ్చరించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎలక్షన్ కమీషనర్ కేంద్ర హోంశాఖ సెక్రటరీకి ఓ లేఖ రాశారు. ఈ లేఖ విషయంలో ఇప్పుడు మరో వివాదం కొనసాగుతుంది.
అసలు ఈ లేఖ ఈసీ రాయలేదని... తెలుగుదేశం పార్టీ నాయకులే ఎన్నికల కమీషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి లేఖ రాశారని వైసిపి ఆరోపిస్తోంది. ఈ ఆరోపణపై ఈసీ రమేష్ కుమార్ స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఈ ఈసి లేఖపై విచారణ జరిపి నిజానిజాలను బయటపెట్టాలంటూ వైసిపి ఎమ్మెల్యేలు రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు.
undefined
డిజిపికి వైసిపి ఎమ్మెల్యేలు రాసిన లేఖ యధావిధిగా
గౌరవనీయులు గౌతం సవాంగ్ గారు,
రాష్ట్ర డీజీపీ,
పోలీస్ హెడ్‌క్వార్టర్స్, మంగళగిరి.
విషయం– కేంద్ర హోం సెక్రెటరీకి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉత్తరం రాశారని నిన్న, ఈ రోజు మీడియాలో వచ్చిన వార్తలు, కథనాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు, ముఖ్యమంత్రిగారి ప్రతిష్ఠకు, వైయస్సార్ కాంగ్రెస్ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయి. ఈ విషయం మీద లోతైన విచారణ జరిపి బాధ్యులను చట్టప్రకారం శిక్షించాలని విజ్ఞప్తి.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అధికారిక లెటర్ హెడ్‌మీద, ఆయన పేరుతో, ఆయన చేశారంటున్న సంతకంతో నిన్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ద్వారా విడుదల అయిన ఆ ఉత్తరం రాజ్యాంగ బద్ధపదవి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థాయిని, కమిషన్ పూర్తిగా దిగజార్చేలా ఉంది. ఒక రిటైర్డ్ ఐయేఎస్ అధికారి, ఒక హైకోర్టు న్యాయమూర్తి హోదా కలిగిన అధికారి ఉపయోగించే పదజాలం కాకుండా రాజకీయ శత్రువులు, రాజకీయ కుట్రదారులు వాడే పదజాలంతో ఈ ఉత్తరం విడుదల అయినందున, ఆ ఉత్తరాన్ని తెలుగుదేశం మీడియా ఒక పథకం ప్రకారం నిన్న మూడు గంటల పాటు పనిగట్టుకుని ప్రసారం చేసినందున; ఈ రోజు జాతీయ మీడియాలో కూడా కొన్ని పత్రికలు ఆ ఉత్తరాన్ని ప్రచురించినందున... రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు, ముఖ్యమంత్రిగారి ప్రతిష్ఠకు, వైయస్సార్ కాంగ్రెస్ ప్రతిష్ఠకు ఈ వ్యవహారం భంగం కలిగిస్తున్నందున... రాష్ట్ర ప్రయోజనాల రీత్యా శ్రీ రమేశ్‌కుమార్ ఉత్తరం వ్యవహారం మీద పూర్తిస్థాయిలో విచారణ చేయించాల్సిందిగా రాష్ట్ర పోలీసును కోరుతున్నాం.
ఈ ఉత్తరం రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచే విడుదల అయిందా అని మేం విచారించాం. అక్కడినుంచి కాకుండా, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి, ప్రత్యేకంగా శ్రీ నారా చంద్రబాబునాయుడుకు సన్నిహితులైన అయిదుగురు పాత్రికేయుల ద్వారా ఈ ఉత్తరం మిగతా మీడియాకు వెళ్ళిందని మాకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ స్థాయిలో ఎవరెవరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారో, ఎవరు ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని, దాన్ని అస్థిరపరచటానికి తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేందుకు ప్రయత్నిస్తున్నారో సమగ్రమైన విచారణ చేయటంతోపాటు, బాధ్యులకు శిక్షలు పడేలా చట్ట ప్రకారం అన్ని చర్యలూ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఆ ఉత్తరం రాష్ట్ర ఎన్నికల కమిషనరే రాశారా? లేక వేరెవరైనా రాశారా? రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న శ్రీ నిమ్మగడ్డ రమేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యతిరేక మీడియాకు, ప్రతిపక్షాల స్పెక్యులేషన్‌కు ఎందుకు అవకాశం ఇచ్చారు? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణ కాకుండా తానే నేరుగా రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఎవరి రాజకీయంలో ఆయన భాగం అయ్యారు? బయటకు వచ్చి ఆ ఉత్తరం మీద ఔనో, కాదో ఎందుకు వివరణ ఇవ్వకుండా ఉండిపోయారు? ప్రజాస్వామ్యబద్ధంగా, రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అసెంబ్లీలో 86 శాతం సీట్లు; 51 శాతం ఓట్లు; 25కు 22 ఎంపీలు గెలుచుకున్న ప్రజాస్వామిక ప్రభుత్వం, 9 నెలల్లోనే దాదాపు 90 శాతం మేనిఫెస్టో వాగ్దానాల అమలుకు రంగం సిద్ధం చేసిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల సంతప్తి మరింతగా పెరిగి ఏకగ్రీవాలు కావటం ఒక సహజపరిణామం. ఈ అంశంతో విభేదించటం అంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని చెప్పటమే.
శ్రీ రమేశ్ కుమార్ ప్రతిపక్ష తెలుగుదేశం కక్ష సాధింపు వ్యూహంలో, కుట్రల్లో తానూ భాగమై... చివరికి దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరఫున ఎందుకు కేవియట్ వేశారు? ఎందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల పత్రికలు, చానళ్ళు నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను నెత్తికి ఎత్తుకుంటున్నాయి? రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి... పార్టీలకు అతీతంగా ప్రజాస్వామ్య ప్రక్రియను నిర్వహించాల్సిన వ్యక్తికి ఉండాల్సిన స్వతంత్రతకు, నిష్పాక్షికతకు ఇంతగా భంగం కలగటం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు, కమిషనర్ పదవికి, ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్న భావంతోనే ఈ వ్యవహారం మీద సమగ్ర విచారణ కోరుతున్నాం.
ఎన్నికలను 45 రోజులు వాయిదా వేస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకోవటంతోపాటు, ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేలా ఎన్నికల నియమావళి ఈ కాలానికి వర్తిస్తుందన్న శ్రీ నిమ్మగడ్డ రమేశ్ నిర్ణయాన్ని సుప్రీం క్రోర్టు పక్కనపెట్టిన వెంటనే... రాష్ట్ర ప్రభుత్వం మీద అసత్యాలతో తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన లెటర్‌హెడ్‌మీద ఆయన సంతకంతో మరో ఉత్తరం గంటల్లోనే విడుదల అయింది. రాష్ట్రంలోని తెలుగుదేశం అనుకూల మీడియా ఈ లేఖను ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి వాడుకుంది. ఇంత జరుగుతుంటే... ఎన్నికల కమిషనర్‌గా ఉన్న వ్యక్తి దాన్ని బయటకు వచ్చి ఆ లేఖ తాను రాసిందో, కాదో చెప్పకుండా ఎవరికీ అందుబాటులో లేకుండా మాయమయ్యారంటే... ఈ వ్యవహారం పూర్తి రాజకీయ వ్యూహంలో భాగంగా నడుస్తోందన్నది మా నమ్మకం. శ్రీ నిమ్మగడ్డ రమేశ్ తన ఉత్తరాన్ని ధ్రువీకరించటంగానీ, నకిలీ ఉత్తరం అయితే బహిరంగంగా వచ్చి ఖండించటంగానీ చేయాలి. ఆ రెండూ చేయకుండా ఆయన ఇక్కడి ప్రతిపక్ష రాజకీయ ఎత్తుగడల్ని బలపరిచేలా, ప్రభుత్వాన్ని అస్థిరపరచేలా అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళిపోయారు? ఆయన భౌతికంగా, మానసికంగా ఎవరికి బందీగా ఉన్నారు? ఈ విషయాలమీద... ఒక పనిగా పెట్టుకుని ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్న పాత్రికేయులమీద సత్వరం విచారణ జరపాలని కోరుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ విజ్ఞాపన ఇస్తున్నాం. ఈ విషయంలో, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ పోలీసుల సహకారం అవసరమైతే తీసుకుని నిజాలను వెల్లడించాలని కోరుతున్నాం.
ఇట్లు...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు
1. అంబటి రాంబాబు
2. కె. పార్థసారథి
3. జి. శ్రీకాంత్ రెడ్డి
4. జోగి రమేష్
5. మల్లాది విష్ణు
6. టీజేఆర్ సుధాకర్ బాబు
7. కె. అనిల్