పంతులమ్మ అవతారమెత్తిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. బోర్డుపై వివరిస్తూ విద్యార్ధులకు పాఠం (వీడియో)

By Siva KodatiFirst Published Oct 20, 2022, 4:40 PM IST
Highlights

వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టీచర్ అవతారమెత్తారు. గురువారం మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆమె క్లాస్ రూమ్‌లోకి వెళ్లి బోర్డుపై వివరిస్తూ పాఠాలు చెప్పారు. 

నిత్యం రాజకీయాల్లో బిజీగా వుండే వైసీపీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గురువారం టీచర్ అవతారం ఎత్తారు. మేడికొండూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధించారు. క్లాస్ రూమ్‌లోకి వెళ్లి... చేతిలో పాఠ్య పుస్తకం పెట్టుకుని పాఠాలు చెప్పారు. అది కూడా విద్యార్ధులకు అర్థమయ్యేలా బోర్డుపై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు ఎమ్మెల్యే. బయో సైన్సులోని రిప్రొడక్టీవ్ సిస్టం గురించి బోధించి... అనంతరం పలు ప్రశ్నలు వేసి పిల్లల నుంచి సమాధానాలు కూడా రాబట్టారు. 

సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు శ్రీదేవి. పదో తరగతిలో పదికి పది మార్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఎమ్మెల్యే సూచించారు.  ఏదేమైనా నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలు, వివిధ పనులతో క్షణం తీరిక లేకుండా వుండే ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనలో ఉన్న మరో కొత్త టాలెంట్‌ను అందరికీ పరిచయం చేశారు. ప్రస్తుతం ఆమె పాఠాలు చెబుతోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇకపోతే.. తాడికొండ వైసీపీలో ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. తాడికొండ నియోజకవర్గం వైసీపీ అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌‌ను నియమించడంపై స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ నియమాకాన్ని ఉండవల్లి శ్రీదేవి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుచరులు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. డొక్కాకు వ్యతిరేకంగా శ్రీదేవి అనుచరులు నినాదాలు చేయగా.. మరోవైపు శ్రీదేవికి వ్యతిరేకంగా డొక్కా‌ వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో ఈ తాడికొండ పంచాయతీ అధిష్టానం వరకు వెళ్లింది. 

 

click me!