రోడ్డు ప్రమాదం , కొనఊపిరితో క్షతగాత్రుడు.. ప్రథమ చికిత్సతో ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే శ్రీదేవి

Siva Kodati |  
Published : Dec 02, 2022, 08:34 PM IST
రోడ్డు ప్రమాదం , కొనఊపిరితో క్షతగాత్రుడు.. ప్రథమ చికిత్సతో ప్రాణాలు కాపాడిన ఎమ్మెల్యే శ్రీదేవి

సారాంశం

వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న వ్యక్తికి ప్రథమ చికిత్స చేశారు. 

వైసీపీ మహిళా నేత, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి తన పెద్ద మనసు చాటుకున్నారు. రాజకీయాల్లోకి వెళ్లినా.. తాను స్వతహాగా డాక్టర్‌ననే విషయాన్ని రుజువు చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తికి ఆమె ప్రథమ చికిత్స చేశారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం సాయంత్రం ఆమె విజయవాడ నుంచి గుంటూరు వెళ్తుండగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు జాతీయ రహదారిపై జనం గుమిగూడి కనిపించారు. అక్కడ ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి వున్నాడు.. చుట్టూ వున్న జనం చూస్తున్నారే గానీ ఎవరు సాయం చేసేందుకు ప్రయత్నించడం లేదు. 

కారులో ఉండి ఇదంతా గమనించిన ఎమ్మెల్యే శ్రీదేవి హుటాహుటిన తన వాహనంలో నుంచి దిగి పరుగుపరుగున గాయపడిన వ్యక్తి దగ్గరకు చేరుకుని నాడి చూశారు. నాడి కొట్టుకోవడం గమనించిన ఆమె వెంటనే ప్రథమ చికిత్స అందించారు. తలకు బలమైన గాయాలు కావడంతో రక్తస్రావం కాకుండా చేశారు. అనంతరం 108కు ఎమ్మెల్యే శ్రీదేవి స్వయంగా కాల్ చేసి సమాచారం ఇవ్వగా వాహనం వచ్చింది.  స్థానికులు, ఎమ్మెల్యే సిబ్బంది ఆ వ్యక్తిని 108 వాహనంలోకి ఎక్కించి ఆక్సిజన్ అందేలా చేశారు.  అనంతరం ఎమ్మెల్యే శ్రీదేవి స్థానికులతో మాట్లాడుతూ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని ఆదుకోవాలని అలా చూస్తూ ఉండడం సరైన విధానం కాదని సూచించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మానవత్వంతో  ప్రాణాలు కాపాడేందుకు తాపత్రయపడిన ఉండవల్లి శ్రీదేవిపై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్