
కర్నూలు జిల్లా అదోనిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాలు.. వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రజలకు వద్దకు వెళ్లి జగన్ సర్కార్ చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎమ్మెల్యేలకు కొన్నిచోట్ల నిరసన సెగ తగులుంది.
తాజాగా ఆదోనిలోని రెండో వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి.. లబ్దిదారులకు ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ అనే వ్యక్తి తాము నివాసం ఉంటున్న గుడిసెకు కూడా పన్ను పెరిగిందని వాపోయారు. చిన్న గుడిసెకు ఇంతలా పన్ను పెంచితే ఎలా అని ప్రశ్నించారు.
అయితే సంక్షేమ పథకాలు వస్తున్నాయి కదా అని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అడగగా.. తాము కట్టిన పన్నుల వల్లే కదా పథకాలు ఇస్తున్నారని శ్రీనివాస్ సమాధానం చెప్పారు. చివరకు శ్రీనివాస్ పన్నులు తగ్గించాలని కోరగా.. అలా చేయడం సాధ్యపడదని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.