
అసెంబ్లీ ఎన్నికలకు (ap assembly elections 2024) సమయం దగ్గరపడుతుండటంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ (ys jagan) 'గడప గడపకు వైసీపీ' (gadapa gadapaku ycp) అనే కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకు వెళ్లి ప్రజలతో మమేకం కావాల్సి ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాల్సి ఉంటుంది. అయితే, కొన్ని చోట్ల ఈ కార్యక్రమంలో మంత్రులు, వైసీపీ నేతలకు నిరసన సెగ తగులుతోంది. తమ వద్దకు వస్తున్న ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తూ.. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా బుధవారం కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ పరిధిలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఏళ్లుగా పరిష్కారం సమస్యను స్థానిక ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ప్రజలపై అసహనం వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే... ఆదోని మండల పరిధిలోని అలసందగుత్తిలో బుధవారం ఎమ్మెల్యే సాయిప్రసాద రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్సీ కాలనీ వాసులు తమ ప్రాంతంలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న మురుగు నీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఒక్కసారిగా అసహనం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యే 30 ఏళ్ల సమస్యను ఇప్పుడు అడుగుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చి మూడేళ్లే అయ్యిందని, తర్వాత పరిష్కరిస్తామని చెబుతూ సాయిప్రసాద రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Also Read:‘‘గడప గడప’’కుపై వైసీపీలోనే వ్యతిరేకత .. ఏం చేశామని వెళ్లమంటారు : జగన్‌ని ప్రశ్నిస్తున్న కౌన్సిలర్
మరోవైపు.. ఇటీవలే మంత్రి గుమ్మనూరు జయరాంకు (gummanur jayaram) చేదు అనుభవం ఎదురైంది. మంత్రి బుధవారం కర్నూలు జిల్లా (kurnool district) అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే.. రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు.. అదిపోయినా తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
ఇక, రానున్న ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని వైసీపీ అడుగులు వేస్తుంది. మంత్రులు, వైసీసీ ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లేలా సీఎం జగన్ ప్రణాళికలు రచించారు. నేటి నుంచి గడప గడపకు వైసీపీకి శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే తప్పనిసరిగా సచివాలయాల కేంద్రంగా గడప గడపకు వెళ్లాలని పార్టీ అధినేత జగన్ ఆదేశాలు జారీ చేశారు. నెలలో కనీసం 10 సచివాలయాలను సందర్శించాలని చెప్పారు. దీంతో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి వివరించడమే కాకుండా.. అవి అందుతున్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే కొన్నిచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలకు స్థానికుల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి.