
హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రోజా (rk roja) పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేశారు. కాలానికి తగ్గట్టు తను కూడా మారుతూ.. అత్త, అమ్మ వంటి పాత్రలు కూడా చేస్తున్నారు. అలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. కొద్దికాలం టీడీపీలో (tdp) వున్న ఆమె అనంతరం వైసీపీలో (ysrcp) చేరి 2014, 2019 ఎన్నికల్లో చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ అధికారంలోకి వచ్చాక తృటిలో మంత్రి పదవి చేజారినా.. రానున్న కాలంలో ఆ ఛాన్స్ దక్కే అవకాశాలు లేకపోలేదు. దీంతోపాటు జబర్ధస్త్ , బతుకు జట్కా బండిలాంటి టీవీ షోలతో తెలుగు ప్రజలకు ఇంకా చేరువయ్యారు. అటు రాజకీయాన్ని, ఇటు టీవీ, సినీ పరిశ్రమలను ఏకకాలంలో ఈదేస్తున్నారు
ఈ సంగతి పక్కనబెడితే.. ఇటీవలి కాలంలో సెలబ్రెటీలంతా యూట్యూబ్ ఛానెల్స్ స్టార్ట్ చేసి వారి ఇంటిని ‘‘హోమ్ టూర్’’ రూపంలో చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే రోజా తొలిసారి నగరిలో తన ఇంటిపై హోమ్ టూర్ చేసింది. ఇంటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అవుతున్నాయి. అయితే అందరిలా యూట్యూబ్‌లో కాకుండా.. ఏకంగా టాప్ ఛానెల్‌లో హోమ్ టూర్‌ని విడుదల చేస్తుండటం విశేషం. శ్రీవారి ఫోటోతో ఇంట్లోకి స్వాగతం పలికిన రోజా అనంతరం పూజాగది, బెడ్ రూమ్, హాల్, పిల్లల గదులు సహా కొన్ని అపురూపమైన ఫోటోలను పంచుకున్నారు. ఎంతో విశాలవంతమైన, ఇంద్రభవనం లాంటి రోజా ఇంటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.