
చిత్తూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబును నమ్మితే నట్టేట ముంచారని ప్రజలంతా అనుకుంటున్నారని విమర్శించారు. రావాలి జగన్,కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా తన సొంత నియోజకవర్గమైన నగరి నియోజకవర్గంలో ప ర్యటించారు. తమ నియోజకవర్గానికి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నిధులు విడుదల చేయకుండా చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అయినా తన వంతు సహాయం ప్రజలకు అందిస్తున్నానని రోజా తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని వెంటనే ప్రజల సమస్యలన్నీ తీరిపోతాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు దివంగత టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కుటుంబం ప్రోటోకాల్‌ను పక్కదారి పట్టిస్తోందని రోజా ఆరోపించారు. ప్రజా ప్రతినిధిగా ముద్దుకృష్ణమ నాయుడి సతీమణి సరస్వతి ఉండగా ప్రభుత్వం కార్యక్రమాల్లో మాత్రం ఆమె కొడుకు పాల్గొంటున్నాడని రోజా విమర్శించారు.
భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు రోజా తెలిపారు. అలాగే చిత్తూరు జిల్లాలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆమె కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.