
అమరావతి : వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత పరిపాలన సౌలభ్యం కోసమంటూ ఏర్పాటుచేసిన వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కు వాలంటీర్లే కారణమనేలా పవన్ చేసిన కామెంట్స్ పై వైసిపి నాయకులు భగ్గుమంటున్నారు. మాజీ మంత్రి, వైసిపి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కూడా పవన్ పై విరుచుకుపడ్డారు.
ఓ రాష్ట్రంలో పాలన ఎలా జరుగుతుందో కూడా పవన్ కు తెలియదని... దేనిపైనా అవగాహన లేకుండానే మాట్లాడటం ఆయనకు అలవాటేనని కన్నబాబు ఎద్దేవా చేసారు. వాలంటీర్ వ్యవస్థ గురించి, వాలంటీర్లు ప్రజలకు అందిస్తున్న సేవల గురించి కూడా పవన్ కు తెలియదని... కేవలం ప్రభుత్వంపై బురదజల్లేందుకే నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని అన్నారు. ముఖ్యమంత్రిపై ద్వేషం, అసూయతోనే పవన్ కనీస స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడని కన్నబాబు మండిపడ్డారు.
Read More నా భార్య కూడా ఏడుస్తోంది.. ఆమెను అంతకు మించి ఏమి అడగలేకపోయాను: పవన్ కల్యాణ్
వాలంటీర్ల ద్వారా అందిస్తున్న సేవలతో వైసిపి ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందని... ఈ కడుపుమంటతోనే పవన్ వాలంటీర్లను టార్గెట్ చేసారని కన్నబాబు అన్నారు. ఏమాత్రం సభ్యతా సంస్కారం వున్నా పవన్ ఆలోచించి మాట్లాడేవాడని... అవే లేవు కాబట్టే ఎవరిని పడితే వాళ్లను దూషిస్తున్నాడని అన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను చూసి అయినా పవన్ మాటతీరు మార్చుకోవాలని కన్నబాబు సూచించారు.
క్రైం రికార్డ్ బ్యూరో 2021 నివేదిక ప్రకారం మహిళల మిస్సింగ్ లో ఏపీ 11వ స్థానంలో వుందని... రికవరీలో మాత్రం 2వ స్థానంలో వుందని కన్నబాబు తెలిపారు. ఏపీలో కంటే 10 రాష్ట్రాల్లో ఎక్కువమంది మహిళలు మిస్సవుతున్నారని ఈ నివేదిక చెబుతోంది... మరి ఆ రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్థ లేదుకదా? మరి ఆ రాష్ట్రాల్లో మహిళల అదృశ్యానికి కారణమెవరో పవన్ చెప్పాలని కన్నబాబు ప్రశ్నించారు.