
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై చేసిన కామెంట్స్‌పై రచ్చ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి పవన్ మరోసారి స్పందించారు. ఏపీలోని ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని పునరుద్ఘాటించారు. వాలంటీర్ల తప్పుడు పనులు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. పవన్ కల్యాణ్ ఈరోజు జనసేన నేతలు, వీరమహిళలతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు తీసుకున్నారని విమర్శించారు. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏమీ చేయని పార్టీ వైసీపీ అని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకుండా తనను చాలామంది బెదిరించారని... ప్రలోభ పెట్టారని.. వందల కోట్లు ఇస్తామన్నారని చెప్పారు. తనకు జగన్ అంటే కోపం లేదని.. ప్రభుత్వ విధానాలపైనే నాకు ద్వేషం అని తెలిపారు. నాయకులు చేసిన తప్పులు ప్రజలపై ప్రభావం చూపిస్తాయని అన్నారు.
వాలంటీర్లపై తనకు కోపం లేదని.. ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వాలంటీర్ల వేతనాలు ఉన్నాయని అన్నారు. వాలంటీర్ వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వాలంటీర్ల వద్ద ఉందని.. ఆ సమాచారాన్ని ఎక్కడకు తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌ను పట్టిపీడిస్తున్న జగన్ అనే జలగ మాట్లాడడని.. కిరాయి మూకలను దింపుతాడని విమర్శించారు. జగన్ ఎప్పుడూ విప్లవకారుడితో గొడవ పెట్టుకోలేదని.. ఆ విషయం తెలుసుకోవాలని అన్నారు. ‘‘ఒక ఇళ్లు అద్దెకు ఇవ్వాలంటేనే వారికి ఎంత మంది మగపిల్లలు ఉన్నారు, వారు ఏ వయసు వారు అని చూస్తారు. పది మంది యువకులు రోడ్డు మీదకు వస్తే.. ఎందుకయ్యా మా సందులోకి వచ్చారని అడుగుతారు. అలాంటిది.. పది మంది యువకులు అఫిషీయల్ గానూ, అన్ అఫిషీయల్ గానూ ఇళ్లలోకి వచ్చేస్తున్నారు. ఇది ఇబ్బంది కాదా?. వారికి వేరే ఉపాధి కల్పించండి. రూ. 30 వేల కోట్లు సారా నుంచి లాగేశారు కదా.. దానిని వారికి ఇవ్వండి. దీనిపై ప్రజలు మేల్కొనకపోతే మీ భవిష్యత్తుకే నష్టం.
నేను సగటు మనిషినే. నాకు పిల్లలు ఉన్నారు. వీళ్లు అన్న మాటలకు నా భార్య కూడా ఏడుస్తోంది. కానీ సర్దిచెప్పుకుని ముందుకు వెళ్తాం.. ఎందుకంటే నేను బాధ్యత తీసుకున్నాను, వెనక్కి రాలేను. అదే నా భార్యకు చెబుతాను. నా వల్ల నువ్వు మాట పడుతున్నందుకు క్షమించు అనడం తప్ప అంతకు మించి నేను ఏమి అడగలేకపోయాను. జగన్ కుటుంబ సభ్యులను మాత్రం మనం ఏమి అనకూడదు. వాళ్లను మేడమ్.. మేడమ్ అని అనాలి. వాళ్లు మాత్రం మనల్ని ఏదైనా అనొచ్చు’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సీఎం జగన్ సంస్కర హీనుడని విమర్శించారు. జగన్ మహిళలను కించపరిచి.. రేపిస్టులను పెంపొదిస్తున్నారని విమర్శించారు. మహిళలు రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. జగన్ నడుపుతున్న సమాంతర వ్యవస్థ నడుము విరగొడతానని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను రక్షించేందుకు అందరు కదలాని అన్నారు. జగన్ పోవాలి.. జనసేన రావాలని పిలుపునిచ్చారు.