
జససేన అధినేత పవన్ కల్యాణ్‌పై కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. చంద్రశేఖర్‌రెడ్డి… తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా తాను ఓడిస్తానని అన్నారు. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి పవన్ కల్యాణ్.. తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ ప్రస్తావన వచ్చింది. దీంతో స్పందించిన ద్వారంపూడి.. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.
వచ్చే ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కల్యాణ్ ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తామని ద్వారంపూడి చెప్పుకొచ్చారు. ఆయన పోటీ చేసే నియోజకవర్గంలో తాను వైసీపీ ఇంచార్జి పోస్ట్ తీసుకుంటానని కూడా చెప్పారు. పవన్ పోటీ చేసే చోట ఆయనను ఓడిస్తానని శపథం చేశారు. మరోవైపు జనసేన కార్యకర్తలకు పవన్ కల్యాణ్ అన్యాయం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నారని.. త్వరలో జన సైనికులు బాధపడే రోజు వస్తుందన్నారు.
ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌కు వెన్నుపోటు పొడవడం ఒక లెక్కా అని ఎద్దేవా చేశారు. ప్యాకేజీలకు అమ్ముడుపోయి పార్టీ నేతలు, కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని పవన్ కళ్యాణ్‌ను కోరుతున్నానని ద్వారంపూడి అన్నారు.
ఇక, ఇటీవల జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ద్వారంపూడి చంద్రశేఖర్‌పై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ‘ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చిబూతులు తిట్టారు. అది వైసీపీ వాళ్లకు అలవాటే. నేను భరించాను. కానీ... నన్ను తిడితే మా జనసైనికులు, వీర మహిళలకు కోపం వస్తుంది. గతంలో ద్వారంపూడి కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్ ట్రీట్‌మెంట్ జరిగింది. భవిష్యత్‌లో ఇలాగే చేస్తే... భీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ అంటే ఏమిటో చూపిస్తాను’ అని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ద్వారంపూడి చంద్రశేఖర్‌పై పవన్‌కు కౌంటర్‌గా విమర్శలు చేస్తున్నారు. మరి ద్వారంపూడి చేసిన తాజా విమర్శలపై జనసేన నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచిచూడాలి.