నాగలక్ష్మిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే - తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

Published : Mar 19, 2022, 12:30 PM IST
నాగలక్ష్మిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే - తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

సారాంశం

ఏపీలో మహిళలపై జరుగుతున్న దాడులు, లైంగిక వేధింపులు అరికట్టాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె శనివారం ఏపీ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ అలసత్వం వల్లే వీఏవో నాగలక్ష్మి చనిపోయారని ఆరోపించారు. 

వీఏవో నాగ‌ల‌క్ష్మిది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. శ‌నివారం ఆమె ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి బ‌హిరంగ లేఖ రాశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ప్ర‌స్తావించారు. 

ఏపీలో మహిళలపై వరుస అత్యాచారాలు, లైంగిక దాడులు జ‌రుగుతున్నాయ‌ని వంగలపూడి అనిత ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అర్ధరాత్రి ఆడబిడ్డ స్వేచ్ఛగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్రం వ‌చ్చిన‌ట్టు అని మహాత్ముడు చెప్పార‌ని కానీ ఏపీలో వైసీపీ పాల‌న‌లో ఈ ప‌రిస్థితులు ఉన్నాయా అని ప్ర‌శ్నించారు. ఓ మ‌హిళ‌గా ఎంతో ఆవేద‌నతో ఈ లేఖ రాస్తున్నాన‌నీ, బ‌హుషా ఎప్పటిలాగే సీఎం దీనిని కూడా తేలిక‌గా తీసుకోవ‌చ్చ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. అయిన‌ప్ప‌టికీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను సీఎం దృష్టికి తీసుకొస్తూనే ఉంటాన‌ని తెలిపారు. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వీఏవో నాగలక్ష్మి బలవన్మరణం త‌న మ‌న‌స్సును క‌లిచివేసింద‌ని వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేత గరికపాటి నరసింహారావు వేధిస్తున్నాడని, నీచంగా మాట్లాడుతున్నాడని, ఆమెపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నించారు. ఇది జ‌గ‌న్ అసమర్థ పాలనకు నిదర్శనం అని విమ‌ర్శించారు. నాగలక్ష్మిది ప్రభుత్వ హత్యేన‌ని, తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించి ఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవా అని ప్ర‌శ్నించారు. 

మహిళలకు రక్షణగా నిలవాల్సిన అధికార వైసీపీ నేతలే కాలకేయుల మాదిరి అఘాయిత్యాలకు తెగబడుతుంటే మీకు సిగ్గుగా అనిపించడం లేదా అని అనిత ఆ లేఖ‌లో అన్నారు. వారిపై ప్ర‌భుత్వం ఏం చ‌ర్య‌లు తీసుకుంద‌ని ప్ర‌శ్నించారు. మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమవడానికి ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే కారణమ‌ని ఆమె మండిప‌డ్డారు. సీఎం సొంత జిల్లా కడపలో ఇంటర్ విద్యార్థిణిని ఓ కిరాతకుడు అత్యాచారం చేస్తే నిందితుడికి శిక్షించకపోవడం దేనికి సాంకేతంగా భావించాల‌ని ఆమె ప్ర‌శ్నించారు. 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకుడు విదేశీ వనితను చెరపట్టబోయాడని అనిత అన్నారు. ఇప్ప‌టికి ఆ నిందితుడు ద‌ర్జాగా తిరుగుతున్నార‌ని అన్నారు. దీనిని బ‌ట్టి ఇది నేర‌స్తుల ఫ్రెండ్లీ గ‌వ‌ర్న‌మెంట్ అని తెలుస్తోంద‌ని ఆరోపించారు.  గుంటూరు జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ కుమారుడు ఓ అంగన్ వాడీ ఆయాను త‌న‌కు స‌హ‌క‌రించ‌క‌పోతే ఉద్యోగం ఊడ‌గొడ‌తానంటూ బెదిరించాడ‌ని, ఈ ఘ‌ట‌న చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తున్నాయో అర్ధమవుతోందని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. 

సాక్షాత్తూ సీఎం ఇంటి సమీపంలో గ్యాంగ్ రేప్ జరిగి ఏడాది దాటినా ఇప్ప‌టి వ‌ర‌కు నిందితుడు వెంకట్ రెడ్డిపై చర్యలు లేవ‌ని వ‌నిత ఆరోపించారు. ఆ నేరంలో నిందితుడికి వెంట‌నే క‌ఠిన శిక్షవేస్తే వేరే త‌ప్పు చేయాలంటే నేర‌స్తులు భ‌య‌ప‌డేవారని తెలిపారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరిగే నేరాల్లో 3వ వంతు ఏపీలోనే జరుగుతున్నాయ‌ని ఆమె ఆరోపించారు. అలాగే మహిళలపై జరుగుతున్న భౌతిక దాడుల్లో మొదటి స్థానం, మానవ అక్రమ రవాణాలో 2వ స్థానం, ఎస్సీలపై జరుగుతున్న దాడుల్లో 5వ స్థానం, పని ప్రదేశాల్లో మహిళలపై జరగుతున్న లైంగిక వేధింపు ఘటనల్లో 2వ స్థానంలో ఉంద‌ని తెలిపారు. 

మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలను కూడా వైసీపీ రాజ‌కీయాల‌కు వాడుకుంటోంద‌ని అన్నారు. దిశా పేరుతో ఫేక్ చట్టం తెచ్చి ఇన్నాళ్లుగా మహిళలను మోసం చేయడం సిగ్గుగా అనిపించ‌డం లేదా అని తీవ్రంగా దుయ్య‌బ‌ట్టారు. మృగాళ్ల చేతిలో మహిళలు బలైపోతుంటే వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నట్ట‌ని ప్ర‌శ్నించారు. మహిళా హోంమంత్రి ఉండ‌టం వ‌ల్ల ఎవ‌రికి లాభం అని తెలిపారు. రాష్ట్రంలో మహిళా కమిషన్ పనిచేస్తోందా అని అడిగారు. కల్తీ మద్యం, మాదక ద్రవ్యాల సరఫరా, జే ట్యాక్స్ వసూళ్లను ప‌క్క‌న పెట్టి ఆడబిడ్డల రక్షణపై దృష్టి పెట్టాల‌ని అన్నారు. ఇకపై ఏ ఆడపిల్లా కిరాతకుల చేతిలో అత్యాచారానికి గురి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల‌ని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu
Kandula Durgesh Super Speech: Amarajeevi Jaladhara Scheme Foundation Ceremony | Asianet News Telugu