న్యాయస్థానాలే దేశాన్ని పాలిస్తే.. ప్రభుత్వాలలో గందరగోళమే: ఏపీ అసెంబ్లీలో చెవిరెడ్డి వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 24, 2022, 03:39 PM IST
న్యాయస్థానాలే దేశాన్ని పాలిస్తే.. ప్రభుత్వాలలో గందరగోళమే: ఏపీ అసెంబ్లీలో చెవిరెడ్డి వ్యాఖ్యలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా మూడు రాజధానుల వ్యవహారంపై చర్చకు స్పీకర్ అనుమతించారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి న్యాయవ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

న్యాయవ్యవస్థ (judiciary system) పరిధులు దాటితే చట్ట విరుద్ధమేనన్నారు వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (chevireddy bhaskar reddy) . ఏపీ అసెంబ్లీలో గురువారం మూడు రాజధానులపై (ap three capitals) చర్చ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. కోర్టులకు స్వీయ నియంత్రణ అవసరమన్న మాటను దశాబ్ధాలుగా బుద్ధి జీవులంతా చెబుతున్నారని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం  తాను తీసుకున్న నిర్ణయాలకు జవాబుదారీగా వుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు నచ్చకపోతే.. వారు ఆ ప్రభుత్వాన్నే మార్చేయగలరని చెవిరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ వ్యతిరేకమైతే.. కోర్టులు దానిని కొట్టివేయవచ్చన్నారు. 

అయితే ప్రస్తుతం జరుగుతుంది అందుకు విరుద్ధమైన వ్యవహారమన్నారు. కోర్టులే స్వయంగా పూనుకుని .. పాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రభుత్వాలు చేసేది ఏంటని భాస్కర్ రెడ్డి ప్రశ్నించారు. కోర్టులు తాము తీసుకున్న పాలనా పరమైన నిర్ణయాలకు ఎవరికి జవాబుదారిగా వుంటాయని ఆయన నిలదీశారు. పాలనా వ్యవస్థకు ఏనాటికైనా కోర్టులు ప్రత్యామ్నాయం కాగలవా అని చెవిరెడ్డి ప్రశ్నించారు. అన్ని వ్యవస్థలకు పరిమితులు వున్నట్లుగానే.. కోర్టులకు కూడా కొన్ని పరిమితులు వున్నాయన్నారు. 

ఆ విషయాన్ని గౌరవ న్యాయస్థానాలకు తెలియననిది కాదని.. అలా కాకుండా డిక్రీల ద్వారానే దేశాన్ని పాలిస్తామంటే ప్రభుత్వాలు గందరగోళంలో పడతాయన్నారు. ప్రజాజీవితం గతి తప్పుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హసీన్ అహ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ జమ్మూకాశ్మీర్ కేసులో సుప్రీంకోర్టులో బలమైన తీర్పు ఇచ్చిందని చెవిరెడ్డి గుర్తుచేశారు. ఈ దేశానికి రాజ్యాంగమే సుప్రీమ్ అన్న ఆయన.. 140 కోట్ల మందికి భరోసాగా వుంటుందన్నారు. 

ఈ దేశంలోని శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలకు అంతిమంగా ప్రజలే సుప్రీమ్ అన్న విషయాన్ని చెవిరెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ పవిత్రమైనదన్న ఆయన.. కోర్టులు, న్యాయమూర్తుల పట్ల అందరికీ గౌరవం వుందన్నారు. అంబేద్కర్, కృష్ణ అయ్యర్. సోరాబ్జీ వంటి మహనీయులు న్యాయవ్యవస్థలో వున్నత సంప్రదాయాలను నెలకొల్పారని భాస్కర్ రెడ్డి వెల్లడించారు. ఎందరో మహనీయులు భారత రాజ్యాంగానికి రూపకల్పన చేశారని ఆయన చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం