పోలవరం, అమరావతి పేరుతో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటిరాంబాబు స్పష్టం చేశారు.
అమరావతి: పోలవరం, అమరావతి పేరుతో జరిగిన అవినీతిని బయటకు తీస్తామని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి ప్రసారం చేశారని అంబటి రాంబాబు మండిపడ్డారు.
బుధవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.అమరావతిపై తమకు స్పష్టత ఉందన్నారు. తమ పార్టీ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామన్నారు.మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదన్నారు.
ఆయన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ప్రచారం చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు. శివరామకృష్ణ కమిటీ రిపోర్టును మంత్రి బొత్ససత్యనారాయణ ప్రస్తావించారని అంబటి రాంబాబు తెలిపారు.
అమెరికా పర్యటనలో ఏపీ సీఎం జగన్ జ్యోతి వెలిగించలేదని.. హిందూ వ్యతిరేకి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.బీజేపీలో ఇటీవల కాలంలో చేరిన మాజీ టీడీపీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు చెప్పారు.
అందరూ బాగుపడాలని కోరుకొనే వైఎస్ఆర్ వారసులమని ఆయన చెప్పారు. వరదలు వచ్చింది మొదలు... వరదలు తగ్గే దాకా కన్నెత్తి చూడని చంద్రబాబు రాజకీయ లబ్ది కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.